అక్షరటుడే, కామారెడ్డి: Urea | అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూరియా కోసం తిరిగితిరిగి అలిసిపోయిన అన్నదాతలు రోడ్డెక్కారు. సరిపడా యూరియా ఇవ్వకపోవడాన్ని నిరసించారు.
కామారెడ్డి – సిరిసిల్ల రహదారిపై (Kamareddy-Sircilla road) గురువారం భైఠాయించి ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గంజ్ మార్కెట్ యార్డులో (Ganj Market Yard) యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. కేవలం 200 బస్తాలు మాత్రమే వచ్చిందని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంజ్ నుంచి నవాబ్ వెంచర్ వరకు వెళ్లి సిరిసిల్ల – కామారెడ్డి రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూరియా కోసం రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రోడ్డుపై ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరహరి (CI Narahari) రైతుల వద్దకు వెళ్లి ధర్నా విరమింపజేశారు. రైతులను గంజ్ మార్కెట్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి శుక్రవారం తేదీతో టోకెన్లను దగ్గరుండి పంపిణీ చేశారు. ఈ విషయమై మార్కెట్ కార్యాలయ సిబ్బందిని వివరణ కోరగా 600 బస్తాలు యూరియా అవసరం కాగా 200 బస్తాలు మాత్రమే వచ్చిందని, రాత్రి మరొక 200 బస్తాల లోడ్ వస్తుందని తెలిపారు.
స్వయంగా టోకెన్లు జారీ చేస్తున్న టౌన్ సీఐ నరహరి