అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepal | నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం, రాజకీయ అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా జెన్ జెడ్ (Gen Z) యువత చేపట్టిన నిరసనలు ఉధృతంగా మారిన విషయం తెలిసిందే.
ఆందోళనలు శాంతియుతంగా మొదలైనా, తర్వాత తీవ్ర హింసాత్మకంగా మారి, దేశవ్యాప్తంగా తీవ్ర కల్లోలానికి దారితీశాయి. నిరసనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి(PM KP Sharma Oli) సహా పలువురు మంత్రుల నివాసాలపై దాడులు చేశారు. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. పార్లమెంటు భవనం, సుప్రీంకోర్టు భవనాలు(Supreme Court Buildings) కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటివరకు 30 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.
Nepal | ప్రాణాలని కాపాడుకోవాలని..
ఈ నేపథ్యంలో, పలువురు మంత్రులు భయంతో దేశం విడిచిపెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మాజీ ప్రధాని భార్యను నిరసనకారులు సజీవంగా తగలబెట్టిన ఘటన, అధికార వర్గాల్లో తీవ్ర భయాన్ని రేపింది. తమకూ ఆ పరిస్థితి ఎదురవుతుందనే ఆందోళనతో వారు సైనిక హెలికాప్టర్ల(Military Helicopters) సహాయంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్లకు సరిగ్గా ల్యాండ్ అయ్యే స్థలం లేకపోవడంతో, మంత్రులు గాల్లో వేలాడుతూ బయటపడే ప్రయత్నం చేయడం విస్తుపరిచింది. మంత్రులు వారి ఫ్యామిలీ తాళ్ల సాయంతో తప్పించుకున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేసి దుబాయ్‌కు పారిపోయారు. దేశంలో శాంతి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. ఇక ఇదిలా ఉంటే కమ్యూనికేషన్, ఐటీ మంత్రి పృథ్వి సుబ్బ గురుంగ్ నివాసం కూబి తగలబెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణుపౌడెల్ ఇంటిపై రాళ్లు రువ్వారు. నడి రోడ్డుపై ఆయనపై ఫిజికల్ దాడి చేసి, అనంతరం నదిలోకి తోసేశారు. విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్‌బా మరియు ఆమె భర్త, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ బిస్వో పౌడెల్, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ నివాసాలు కూడా దాడులకు గురయ్యాయి.ప్రస్తుతం, నేపాల్‌లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. సైన్యం పాలన స్వీకరించాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు విధించబడ్డాయి. ఈ పరిణామాలు దేశంలో ప్రజా వ్యతిరేకత, పాలకులపై నిరాశను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇకపైనా నేపాల్(Nepal) రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది చూడాలి.