అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భయాందోళనకు గురి చేస్తుండా, అటవీ శాఖ అధికారులు (Forest Department Officers) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితి ఏకంగా అటవీ సిబ్బందినే పులి కోసం ఏర్పాటు చేసిన బోనులో బంధించే స్థాయికి దారి తీసింది.
ఈ ఘటన గుండుల్‌పేట తాలూకాలోని బొమ్మలాపుర గ్రామంలో (Bommalapura Village) మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి సమీపంలోని బండీపుర జాతీయ పార్క్ (Bandipura National Park) పరిధిలో గత కొన్ని రోజులుగా ఓ పులి సంచరిస్తోంది. ఈ నేపథ్యంలో, అటవీ అధికారులు నాలుగు రోజుల క్రితం పులిని పట్టేందుకు బోనును ఏర్పాటు చేసి, అందులో దూడను ఎరగా కట్టారు.
Karnataka | భలే పని చేశారు..
అయితే బోనుకు వచ్చిన పులి (Tiger) దూడను చంపి వెళ్లిపోయినా, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి మంగళవారం వరకు రాకపోవడం గ్రామస్థులకు కోపాన్ని తెప్పించింది.. దీంతో వారు అటవీ సిబ్బందిని చుట్టుముట్టి, అదే బోనులో వేసి నిరసన తెలుపారు. ఈ సమయంలో వీడియోలు తీస్తూ, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
సుమారు 15 నిమిషాలపాటు అటవీ సిబ్బంది (Forest Department Staff) బోనులోనే బంధించబడగా, తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు, ఇతర గ్రామస్థుల సహాయంతో వారిని విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు లేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇక అదే బండీపుర జాతీయ పార్కులో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ పర్యాటకుడు సెల్ఫీ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రమాదకరంగా ఒక ఏనుగుకు దగ్గరగా వెళ్లాడు. వెంటనే అది అతడిని వెంబడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అటవీ అధికారులు స్పందించారు. పర్యాటకుడిని గుర్తించి, వన్యప్రాణుల భద్రతకు ముప్పు కలిగించినందుకు రూ. 25,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా అధికారులు పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. బండీపుర వన్యప్రాంతాల్లో ఏనుగులు, జింకలు, అడవి పందులు వంటి జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తాయి. పర్యాటకులు వాటికి దూరంగా ఉండాలి. సెల్ఫీల కోసం ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్రవర్తించొద్దు అని హెచ్చరించారు.