అక్షరటుడే, వెబ్డెస్క్ : Nepal | నిరసనలతో అట్టుడికిన నేపాల్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. రెండ్రోజుల పాటు విధ్వంసంతో రగిలిపోయిన హిమాలయ దేశంలో కర్ఫ్యూ విధించిన సైన్యం గురువారం కొన్ని గంటల పాటు ఆంక్షలను సడలించింది.
నిత్యావసరాలు, ఇతరత్రా కొనుగోలు కోసం ఖాట్మండు, లలిత్‌పూర్, భక్తపూర్‌లలో అమలులో ఉన్న కర్ఫ్యూ నిబంధనలు (Curfew Regulations) సడలించింది. గురువారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటలకు ప్రజలను బయటకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. దీంతో గురువారం ఉదయం ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే ప్రజలు మార్కెట్లు (Markets), కిరాణా దుకాణాలకు పోటెత్తారు. అత్యవసర వస్తువులను నిల్వ చేసుకోవడానికి పరుగులు పెట్టారు. “ఏ రూపంలోనైనా ప్రదర్శనలు, విధ్వంసం, దహనం లేదా ఆస్తులపై దాడులు జరిగితే వాటిని నేరపూరిత చర్యలుగా పరిగణించి, తదనుగుణంగా వ్యవహరిస్తామని” సైన్యం హెచ్చరించింది.
Nepal | రణరంగమైన నేపాల్
సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో నేపాల్ (Nepal) రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాపై విధించిన నిషేధంతో మొదలైన నిరసనల పర్వం అవినీతి, బంధుప్రీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది. వేలాది మంది విద్యార్థులు, యువకులు విధ్వంసం సృష్టించడంతో ప్రధాని రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ శాంతించని విద్యార్థులు పార్లమెంట్, సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్షుడు, ప్రధాని, మంత్రుల ఇళ్లకు నిప్పుపెట్టారు. వీధుల్లో వీరంగం వేస్తూ మంత్రులు, మాజీ మంత్రులపై దాడులకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి లూటీ చేశారు. ఈ నేపథ్యంలో సైన్యం రంగంలోకి దిగి కర్ఫ్యూ విధించింది. ఖాట్మండు లోయలోని మూడు జిల్లాల్లో నిషేధాజ్ఞలను విస్తరించింది.
Nepal | సాధారణ పరిస్థితి..
అయితే, నిరసనకారులు శాంతించడం, పరిస్థితి అదుపులోకి రావడంతో ఆర్మీ గురువారం ఆంక్షలను సడలించింది. ప్రజలు అవసరమైన పనులు చేసుకోవడానికి పరిమిత కదలికలను ఖాట్మండు (Kathmandu), లలిత్‌పూర్, భక్తపూర్‌లలో అమలులో ఉన్న కర్ఫ్యూ నిబంధనలను నాలుగు గంటల పాటు, సాయంత్రం రెండు గంటల పాటు ఎత్తేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు తిరిగి అమలులోకి వస్తాయని తెలిపింది. ఉదయం ఆంక్షలు ఎత్తివేయడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. మరోవైపు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) తిరిగి తెరుచుకుంది.
Nepal | పెరిగిన మృతుల సంఖ్య..
ఇటీవల హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ‘జనరల్ జెడ్’ గ్రూప్ నేతృత్వంలో జరిగిన నిరసనల మరణాల సంఖ్య 30కి పెరిగింది. 1,061 మంది గాయపడ్డారని, వారిలో 719 మంది డిశ్చార్జ్ అయ్యారని, 274 మంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ తెలిపింది.