అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాధ ఘటన జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో చోటు చేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు (Rains) పడుతున్న విషయం తెలిసిందే. గద్వాల జిల్లాలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో అయిజ మండలం భూంపురం గ్రామంలో పిడుగు పడింది. పత్తిచేను (Cotton Crop)లో పిడుగు పడటంతో.. పనులు చేపడుతున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు.
Thunderstorm | పనులు చేస్తుండగా..
భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (22), సర్వేశ్ (20), సౌభాగ్యమ్మ (40), మరో ఇద్దరు పత్తి చేనులో కూలీ పని చేయడానికి వెళ్లారు. సాయంత్రం పూట పనులు చేపడుతుండగా పిడుగు పడింది. దీంతో పార్వతమ్మ, సర్వేశ్, సౌభాగ్యమ్మ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం గద్వాల ఆస్పత్రికి తరలించారు.
Thunderstorm | గ్రామంలో విషాదం
గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో భూంపురంలో విషాదఛాయలు అలుముకున్నారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.