అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్ (BC Declaration) అమలు సంబరాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు.
ఇప్పటికే సభాస్థలిని కేబినెట్ మంత్రులు (Cabinet ministers) పరిశీలించారు. అయితే సీఎం రాక సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, వీఐపీల రాకపోకల మార్గాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ రాకపోకలు, భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, దిశ సూచికలు ఏర్పాటు చేయాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సైతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.