అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion) కల్పించాలని ట్రెసా నాయకులు కోరారు. జీపీవోల నియామకం, 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లులకు, 45 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి కల్పించడంపై ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy)ని కలిశారు.
రెవెన్యూ శాఖ(Revenue Department) బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ట్రెసా నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిబద్ధతతో పనిచేసి నిలబెట్టుకుంటామని చెప్పారు.ప్రభుత్వం 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకి సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తహశీల్దార్లకు(Tahsildars) డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలని మంత్రిని కోరారు. సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ప్రమోషన్లతో ఏర్పడిన 33 ఖాళీలను, మిగతా ఖాళీలను ప్రమోషన్లతో భర్తీ చేయాలన్నారు. తమ వినతికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్ర మోహన్, డిప్యూటీ కలెక్టర్లు చంద్రకళ, ఉపేందర్ రెడ్డి, రాజేశ్వరి, ట్రెసా నాయకులు రాజ్ కుమార్, నిరంజన్ రావు, అన్వర్, వాణిరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.