అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్లమని హైడ్రా మరో సారి స్పష్టం చేసింది. వర్టెక్స్ రియల్ ఎస్టేస్ సంస్థకు సంబంధించి హైడ్రాపై ఆరోపణలను సంస్థ ఖండించింది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని పలు చెరువుల్లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అంతేగాకుండా అనేక పార్కుల్లో కబ్జాలను (Land grabbing) తొలగించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అయితే వర్టెక్స్ (Vertex) రియల్ ఎస్టేట్ సంస్థపై హైడ్రా చర్యలు తీసుకోవడం లేదని సుంకరి నరేష్ అనే వ్యక్తి ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను హైడ్రా కొట్టిపారేసింది. ప్రైవేట్ భూ వివాదాల జోలికి తాము వెళ్లమని పేర్కొంది. అదే సమయంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూములలో ఆక్రమణలు జరిగితే ఊరుకోదని తేల్చి చెప్పింది.
Hydraa | అది ప్రైవేటు భూమి
తుక్కుగూడ (Tukkuguda) మున్సిపాలిటీలోని వర్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు, చైతన్య రెడ్డి అనే మహిళకి మధ్య ఉన్న వివాదం పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని హైడ్రా పేర్కొంది. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఇరుపక్షాలను విచారించినట్లు తెలిపింది. ఇద్దరి మధ్య ఉన్న భూ తగాదాలో హైడ్రా తల దూర్చదని స్పష్టం చేసింది.
Hydraa | ఆ సంస్థపై రెండు కేసులు
సూరం చెరువులో వర్టెక్స్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చి వేసినట్లు హైడ్రా తెలిపింది. కొత్తకుంట చెరువులో వర్టెక్స్ సంస్థ మట్టి పోస్తే కూడా చర్యలు చేపట్టామని చెప్పింది. ఈ మేరకు వర్టెక్స్‌పై రెండు కేసులు కూడా నమోదు చేశామని అధికారులు తెలిపారు. అయితే హైకోర్టు (High Court) బార్ కౌన్సిల్ నుంచి తొలగించబడి.. సాంకేతిక కారణాలతో స్టే తెచ్చుకున్న సుంకరి నరేష్ హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Hydraa | ఇద్దరే తేల్చుకోవాలి..
చైతన్యరెడ్డి పేర్కొన్న విధంగా.. ఆమెకు చెందిన భూమిలోంచి వర్టెక్స్ సంస్థ రహదారి వేసిన వివాదంలో.. ఆ ఇరువురే తేల్చుకోవాలని హైడ్రా స్పష్టం చేసింది. ఈ విషయమై చైతన్య రెడ్డి ఇదివరకే పోలీసు స్టేషన్‌లో వర్టెక్స్‌పై కేసు కూడా పెట్టారని గుర్తు చేసింది. ఆమె నుంచి రూ. 50 లక్షలు తీసుకున్న సుంకరి నరేష్‌తో పాటు దళారులుగా వ్యవహరించిన వారిపై చైతన్య రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. అయితే డబ్బులు తీసుకున్న సుంకరి నరేశ్ వర్టెక్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని హైడ్రాపై బురద జల్లుతున్నారని అధికారులు తెలిపారు. దళారీ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.