అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TTD EO | టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఐఏఎస్‌ల బదిలీ చేపట్టిన ప్రభుత్వం ఆయనను ఈవోగా నియమించిన విషయం తెలిసిందే.
అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల (Tirumala)కు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
TTD EO | ఎన్నో జన్మల పుణ్యఫలం
టీటీడీ ఈవోగా పని చేసిన శ్యామల రావును ప్రభుత్వం జీఏడీ (GAD) ముఖ్య కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. బదిలీపై వెళ్తున్న ఆయనను మంగళవారం సాయంత్రం టీటీడీ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ.. టీటీడీలో పని చేయడం ఎన్నోజన్మల పుణ్యఫలమని తెలిపారు. 14 నెలల పాటు ఆయన ఈవోగా పని చేశారు. తన కాలంలో దూరదృష్టితో విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు.
TTD EO | మొదటి అధికారిగా రికార్డు
టీటీడీ ఈవోగా రెండో సారి నియమితులైన మొదటి అధికారిగా సింఘాల్ నిలిచారు. ఆయన గతంలో 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు ఈవోగా పనిచేశారు. తాజాగా మళ్లీ ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన పలు కీలక సంస్కరణలు అమలు చేయడంతో ప్రభుత్వం రెండోసారి అవకాశం కల్పించింది. గతంలో ఆయన టైమ్ స్లాట్ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశ పెట్టారు. అంతేగాకుండా శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust)ను రూపొందించారు. ఈ ట్రస్ట్ ద్వారా టీటీడీ నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది.