అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh)తో భేటీ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు (Gandhi Sarovar Project)కు రక్షణ శాఖ భూములు బదలాయించాలని ఆయన రక్షణ శాఖ మంత్రిని కోరారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్న ప్రణాళికపై సీఎం వివరించారు. ఈ రెండు నదుల సంగమ స్థలంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు.
CM Revanth Reddy | నాలెడ్జ్ హబ్ నిర్మాణం
గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్ నిర్మిస్తామన్నారు. ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని కేంద్ర మంత్రికి వివరించారు. సమావేశంలో ఎంపీలు బలరాం నాయక్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.