అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్ జెడ్ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు దారి తీసింది. అవినీతి, రాజకీయ వారసత్వం, సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు భారీ విధ్వంసానికి దారితీయగా, ప్రధాని కేపీ శర్మ ఓలి(PM KP Sharma Oli) పదవికి రాజీనామా చేశారు.
పలువురు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. ప్రస్తుతం నేపాల్‌లో సైన్యం పరిపాలన సాగిస్తుంది. అయితే జెన్ జెడ్ యువత సెప్టెంబర్ 8, 9 తేదీల్లో నిరసనలు చేపట్టగా అవి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు ప్రధాని ఓలి నివాసాన్ని తగలబెట్టారు. పలువురు మంత్రుల ఇళ్లు దగ్ధమయ్యాయి. పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలకు(Supreme Court Buildings) నిప్పు పెట్టారు.ఈ ఘర్షణల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు, 300 మందికి పైగా గాయపడ్డారు.
Nepal | కారు ఢీకొన్న ఘటన
ఈ ఉద్యమానికి కారణం కారు యాక్సిడెంట్ అని తెలుస్తుంది. ఆగస్టు ప్రారంభంలో ఓ 11 ఏళ్ల బాలిక పాదచారుల క్రాసింగ్ వద్ద నిలబడి ఉండగా, ఆ సమయంలో మంత్రి వాహనం ఆమెను ఢీకొనగా తీవ్రంగా గాయపడింది. అయితే ఆ సమయంలో వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు డ్రైవర్‌ను అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. కానీ 24 గంటల్లోనే డ్రైవర్‌ను వదిలేశారు. ప్రధాని ఓలి ఈ ఘటనను “చిన్న విషయం” అంటూ తేలికగా తీసుకున్నారు. ఈ పరిణామాలపై యువతలో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. #JusticeForTheGirl హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
ప్రభుత్వంపై విమర్శలు పెరగడంతో, సెప్టెంబర్ 4న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విటర్) తదితరాల సోషల్ మీడియా అకౌంట్స్(Social Media Accounts)ని నిషేధించారు. ఫేక్ న్యూస్, విద్వేషపూరిత ప్రచారాలను కారణంగా చూపించారు. ఈ చర్యలు యువతలో మరింత అసహనానికి దారితీశాయి. సెప్టెంబర్ 8 న కాట్మాండు నగరంలో నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు ప్రయోగించారు. ఆ రోజు 19 మంది మృతి చెందారు. సాయంత్రానికి ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసింది . అయితే సెప్టెంబర్ 9 నిరసనలు మళ్లీ కొనసాగాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేపీ శర్మ ఓలి తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇతర మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. అయితే మంగళవారం జరిగిన ఘర్షణల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 22కి పెరిగింది. ప్రస్తుతం నేపాల్ ఆర్మీ (Nepal Army) ప్రభుత్వ అధికారాలను తమ చేతుల్లోకి తీసుకొని శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి ఒక బాలికను మంత్రి వాహనం ఢీకొనడం, దానిపై ప్రభుత్వ నిర్లక్ష్యమే చివరికి ఓ దేశ పాలక వ్యవస్థను గద్దె దించే స్థితికి దారితీసింది.