అక్షరటుడే, వెబ్డెస్క్ : Nara Lokesh | నేపాల్(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఆపదలో ఉన్న తెలుగు ప్రజల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై అత్యవసర చర్యలు ప్రారంభించారు.ఈ నేపథ్యంలో, నేడు అనంతపురంలో జరగనున్న ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’(Super Six – Super Hit) కార్యక్రమాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు. నేపాల్‌లో చిక్కుకున్నవారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, నారా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS) ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.
Nara Lokesh | ప్రత్యేక వార్ రూమ్ – కాల్ సెంటర్ ఏర్పాటు
సచివాలయంలోని RTGS కేంద్రంలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సంబంధిత అధికారులందరికి హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వాట్సాప్ నంబర్, కాల్ సెంటర్ ద్వారా నేపాల్‌లో ఉన్నవారి సమాచారాన్ని సేకరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత రాయబారి కార్యాలయం(Indian Embassy) ద్వారా సమాచారాన్ని సమన్వయం చేస్తున్నారు. ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, 187 మంది తెలుగువారు నేపాల్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారు నాలుగు విభిన్న ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు:
బఫాల్ శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో 27 మంది, గౌశాల – పింగలస్థాన్: 90 మంది, సిమిల్ కోట్: కారి అప్పారావు పర్యవేక్షణలో 12 మంది, పశుపతి నగరం – మహదేవ్ హోటల్: విజయ పర్యవేక్షణలో 55 మంది చిక్కుకున్నట్టు తెలుస్తుంది.ఈ లెక్కలు ప్రాథమికంగా ఉన్నప్పటికీ, పూర్తిగా సమాచారం అందిన తర్వాత ఇంకా ఎక్కువ సంఖ్యలో తెలుగు ప్రజలు చిక్కుకున్నట్టు తేలే అవకాశం ఉంది.మంత్రి నారా లోకేష్ ఇప్పటికే భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవ(Indian Ambassador Naveen Srivastava)తో సంప్రదించి, అక్కడి పరిస్థితిని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారిని తక్షణమే బయటకు తీసుకురావడంపై కార్యాచరణ చేపట్టనున్నారు.తెలుగు ప్రజల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం(Andhra Pradesh Government) ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో చాలా నిబద్ధతతో ముందుకు సాగుతున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రిత్వ శాఖల సమన్వయం ద్వారా త్వరిత ప్రతిస్పందనతో రక్షణ చర్యలు కొనసాగుతాయి.