అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 96 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 14 మంది సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
ఇందులో 11 మంది రాజ్యసభ సభ్యులు కాగా, ముగ్గురు లోక్ సభ సభ్యులున్నారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాల్ దళ్ పార్టీలకు చెందిన ఎంపీలు గైర్హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు ఆయనే వేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఎన్డీయే పక్షాల ఎంపీలు ఓటేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), ఆ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రియాంక గాంధీ క్యూలో నిలబడి ఓటు వేయడం ఆకట్టుకుంది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వీల్ చైర్‌పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.
Vice President Election | ఎన్నికకు దూరంగా మూడు పార్టీలు..
ఆరోగ్య కారణాల వల్ల జూలై 21న జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక తప్పనిసరి అయింది. ఎన్డీయే అభ్యర్థి CP రాధాకృష్ణన్ (CP Radhakrishnan), ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు కలిపి మొత్తం 781 మంది ఉండగా, దాదాపు 96 శాతం పోలింగ్ నమోదైంది. మూడు పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్‌కు చెందిన ఏడుగురు ఎంపీలు, కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి కి చెందిన నలుగురు ఎంపీలు సహా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు, ఒక శిరోమణి అకాలీదళ్ (SAD) ఎంపీతో సహా ముగ్గురు లోక్‌సభ సభ్యులు కూడా ఎన్నికలను బహిష్కరించారు.
Vice President Election | 6 గంటలకు కౌంటింగ్.
ఎన్నిక ముగియడంతో పార్లమెంట్ సిబ్బంది కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఎన్నికల్లో 391 కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలుపొందుతారు. ఎన్డీయేకు 425 మంది ఎంపీలు ఉండగా, ప్రతిపక్ష శిబిరానికి 324 మంది మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనమే కానుంది.