అక్షరటుడే, వెబ్డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించారు. తమ దివంగత తండ్రి సంజయ్ కపూర్ రూ. 30,000 కోట్ల ఆస్తిలో వాటా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
సంజయ్ కపూర్ వీలునామాను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్ పై సెప్టెంబర్ 10న విచారణ జరిగే అవకాశం ఉంది. సంజయ్ కపూర్ వీలునామా(Sanjay Kapoor Will) గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని, సవతి తల్లి ప్రియా కపూర్ లేదా మరే ఇతర వ్యక్తి కూడా దాని ఉనికి గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రియా ప్రవర్తనను బట్టి ఆమె చెబుతున్ను వీలునామా కల్పితమని తెలిపారు. చట్టపరమైన సంరక్షకురాలిగా కరిష్మా ద్వారా ప్రాతినిధ్యం వహించిన పిల్లలు.. ఆస్తి విభజన జరగాలని కోరారు.
Karisma Kapoor | రూ.30,000 కోట్ల ఆస్తి కోసం..
సంజయ్ కపూర్, కరిష్మా కపూర్(Karisma Kapoor) 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం సమైరా, కియాన్. అయితే, విభేదాల నేపథ్యంలో 2016లో సంజయ్, కరిష్మా విడాకులు తీసుకున్నారు. అనంతరం సంజయ్ ప్రియా సచ్ దేవ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే, గుండెపోటు కారణంగా జూన్ 12, 2025న ఆయన మృతి చెందారు. అప్పటి నుంచి వారసుల మధ్య రూ.30,000 కోట్ల ఆస్తి కోసం వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో కరిష్మా పిల్లలు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.
సంజయ్ కపూర్ రాసిన వీలునామాను దాచిన ప్రియా సచ్ దేవ్(Priya Sachdev).. అసలైన దాన్ని దాచి తప్పుడు వీలునామాను ఇటీవల తమ కుటుంబ సమావేశంలో చూపించారని పేర్కొన్నారు. తమ తండ్రి ఆస్తుల గురించి పూర్తి సమాచారం తమ వద్ద లేదని పిల్లలు వాదిస్తున్నారు. ప్రియా కపూర్ వివరాలను దాచిపెట్టి, ఆస్తుల పూర్తి స్థాయిని వెల్లడించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ (సోనా కామ్స్టార్) కార్పొరేట్ సమావేశాలకు తమను పిలిపించి, ట్రస్ట్ డీడ్ లేదా అనుబంధ రికార్డులకు సంబంధించి పూర్తి పారదర్శకత అందించకుండా చట్టపరమైన పత్రాలపై సంతకం చేయమని అడిగారని పేర్కొన్నారు.