అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College) వెల్లూరును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(Thota Lakshmi Kantharao) మంగళవారం సందర్శించారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ దేశంలోని అత్యంత విశ్వసనీయ వైద్య సేవా కేంద్రం(Medical Service Center)గా పేరుగాంచిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సాధారణ చికిత్సల నుండి అత్యాధునిక శస్త్రచికిత్సల వరకు విస్తృతమైన వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించారు. నర్సింగ్, ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు, ఆధునిక పరిశోధనలు, ప్రజారోగ్య శిబిరాలు నిర్వహించడం సీఎంసీ ప్రత్యేకత అని అక్కడి వైద్యులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా వైద్య బృందాన్ని(Medical Team) కలుసుకుని వారు అందిస్తున్న ప్రజా సేవలను అభినందించారు. జుక్కల్ నియోజకవర్గంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థన మేరకు సీఎంసీ వైద్య బృందం త్వరలో జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.