అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి(MLA Bhupathi Reddy) తెలిపారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులను(Best Teachers) సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పౌరునికి విద్య ఎంతో ముఖ్యమన్నారు. ఇప్పటికీ సమాజంలో కొన్నిచోట్ల అనేక అంశాల్లో రుగ్మతలు ఉన్నాయన్నారు. వాటిని విద్యతోనే దూరం చేసే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి వచ్చాక బడ్జెట్లో 10 శాతం విద్యకు కేటాయిస్తున్నామని గుర్తు చేశారు. ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతులు కూడా కల్పించామని తెలిపారు. అలాగే ప్రతి పాఠశాలలో ప్రీస్కూల్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కృషి చేస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులు కూడా సహకరించాలని, ఈ ఏడాది ఉత్తమ మార్కులతో ముందుండాలన్నారు. ప్రధానంగా వెనుక బెంచ్‌ల వారిని గుర్తించాలని, బిల్ గేట్స్, సచిన్ టెండూల్కర్, ప్రధాని మోడీ(PM Modi) లాంటివారు చివరి బెంచ్ నుంచే ఎదిగారన్నారు.
Best Teacher Award | ప్రభుత్వ ఉపాధ్యాయులే నాణ్యమైన విద్య అందిస్తారు
ప్రభుత్వ ఉపాధ్యాయులు నిష్ణాతులై ఉంటారని.. నాణ్యమైన విద్యను అందిస్తారని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ(Education Department) పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది పదో తరగతిలో మరింత మంచి ఫలితాలు సాధించేందుకు ఆర్నెళ్ల ముందు నుంచే కృషి చేయాలన్నారు. పాఠశాలల మరమ్మతులకు ఇప్పటికే నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ నుంచి మరమ్మతులు చేయాలన్నారు. అనంతరం ఆయా కేటగిరీలో 40 మంది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్(DEO Ashok), విద్యాశాఖ ఏడీ నాగజ్యోతి, డీసీఈబీ కార్యదర్శి సీతయ్య, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.