అక్షరటుడే, వెబ్డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రేపు (సెప్టెంబర్ 10) అనంతపురం(Ananthapuram)లో జరిగే ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్(Nara Lokesh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. సభ ప్రత్యేకతలు ఏంటంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత తొలిసారిగా పార్టీ స్థాయిలో నిర్వహించే బహిరంగ సభ ఇదే కావడం విశేషం.
Super Six | భారీ సభ..
కూటమి హామీలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు నివేదిక అందించనున్నారు. అలానే భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) వివరణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం అనంతపూరంలో సందడి వాతావరణం నెలకొంది. కూటమి జెండాలతో నగరం రెపరెపలాడుతోంది. ప్రధాన కూడళ్ల వద్ద భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సభ స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు. సభా వేదికకు వేలాది మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. ప్రముఖ గాయకులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సభలో భాగమవుతాయి. భారీ స్టేజ్, LED స్క్రీన్లని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తమ ప్రసంగాల్లో గత 15 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ హామీల అమలు, వివిధ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణపై తీసుకున్న చర్యలు వంటి అంశాలను ప్రజల ముందు ఉంచనున్నారు. అలాగే భవిష్యత్‌లో కూటమి ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలు, అభివృద్ధి దిశలో కీలక కార్యాచరణను కూడా ప్రజలకు వివరించనున్నారు. ఈ సభతో ప్రజలకు మరింతగా దగ్గరవ్వాలని, ప్రభుత్వ విజయాలను పంచుకోవాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభకు కీలక మలుపుగా భావిస్తున్నారు.