అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahalaya Paksham | భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షంగా పరిగణిస్తారు. ఈ నెలలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది పితృదేవతల(Ancestors or Pitrus)కు ప్రీతిపాత్రమైన కాలం.
అందుకే ఈ కాలంలో పితృ దేవతలను స్మరించుకోవడంతోపాటు పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని పెద్దలు చెబుతారు. మహాలయ పక్షం ఈనెల 8వ తేదీన ప్రారంభమైంది. 21న మహాలయ అమావాస్య(Mahalaya Amavasya). ఈ నేపథ్యంలో మహాలయ పక్షం విశిష్టతలు తెలుసుకుందామా..
Mahalaya Paksham | పురాణ గాధ..
ద్వాపర యుగంలో కర్ణుడి(Karna)కి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆకలి, దప్పిక కలిగాయి. ఒక చెట్టు కనిపించగా దాని వద్దకువెళ్లి పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకోగానే ఆశ్చర్యకరంగా అది కాస్తా బంగారు ముద్దగా మారిపోయింది. ఏ చెట్టు పండు కోసి తినబోయినా అలాగే జరిగింది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకోగానే.. ఆ నీరు కూడా బంగారంగా మారిపోయింది. స్వర్గ లోకానికి వెళ్లాక అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. దీంతో కర్ణుడు ‘‘తాను చేసిన తప్పిదమేమిటి? తనకిలా ఎందుకు జరుగుతోంది’’ అని లోలోపల అనుకుంటాడు. అంతలో అశరీరవాణి వినిపిస్తుంది. ‘‘కర్ణా.. నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు.
అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపంలో చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’ అని పలికింది. అనంతరం కర్ణుడు సూర్యదేవుడి(Surya Devudu) వద్దకెళ్లి తన దోష నివారణకు మార్గం చెప్పమని వేడుకున్నాడు. ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణుడికి ఒక అవకాశమిచ్చాడు. వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్తులకు అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మని చెప్పాడు. కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమిన భూలోకానికి చేరి పేదలు, బంధుమిత్రులకు అన్నసంతర్పణ(Donate Food) చేశాడు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, తిరిగి మహాలయ అమావాస్య నాడు స్వర్గానికి చేరాడు. కర్ణుడి సేవలకు పితృదేవతలు సంతసించడంతో అతడి ఆకలి బాధలు తీరిపోయాయి. కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి అన్నదానం చేసి, అనంతరం స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులనే మహాలయ పక్షంగా పేర్కొంటున్నారు.
Mahalaya Paksham | ఈ పక్షంలో ఏం చేయాలంటే.
దేవుళ్లను ఎలా ఆరాధిస్తామో.. పితృ దేవతలనూ అలాగే ఆరాధించాలని మన ధర్మం చెబుతోంది. పితృ దేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలు. వీరిని స్మరిస్తూ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు వంటివి చేయాలని సూచిస్తోంది. ఇలా చేయడం వల్ల పితృ దేవతల ఆకలి దప్పికలు తీరుతాయని, వారు సంతసించి శుభాలను ప్రసాదిస్తారని, వంశాభివృద్ధిని కలుగజేస్తారని హిందువులు నమ్ముతారు. సాధారణంగా వారు మరణించిన తిథి రోజున పిండప్రదానాలు చేస్తారు. అలా కుదరకపోతే మహాలయ పక్షం(Mahalaya Paksham)లో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృ దేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలొస్తాయంటారు. అంతేకాకుండా మహాలయ పక్షంలో పితృకార్యాలు నిర్వహిస్తే పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతోంది.
Mahalaya Paksham | పాటించాల్సిన నియమాలు
మహాలయ పక్షంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ 15 రోజులూ పితృదేవతలను స్మరించాలి.
బ్రహ్మచర్యం పాటించాలి. మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. రోజూ విధిగా ఒంటిపూట భోజనం చేస్తూ, నేలపైనే నిద్రించాలి.పితృదేవతలకు నిత్యం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జల తర్పణాలు (Tharpanam) వదలాలి. 15 రోజులు వీలు కాని వారు కనీసం మహాలయ అమావాస్య రోజైనా తర్పణం వదలాలి. 15 రోజులపాటు అన్నదానం చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది.
కాకులకు ఆహారం పెట్టాలి. పేదలకు వస్త్రదానం చేయాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి.స్కంద పురాణం ప్రకారం మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధ, దాన, పుణ్యకర్మల వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పితృ దోషాల వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.