అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AP High Court | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు, టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర అటార్నీ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్(Dammalapati Srinivas) కోర్టుకు సమర్పించిన వాదనల్లో, మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన సినిమాల్లో నటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ సందర్భంగా హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఏజీ ప్రస్తావించారు.
AP High Court | కీలక వ్యాఖ్యలు..
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా టికెట్ ధరల పెంపులో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదనే ఆధారాలను పిటిషనర్ చూపలేకపోయారని తెలిపారు. అలాగే, ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా పిటిషన్ దాఖలు చేయడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని వాదించారు. మాజీ IAS అధికారి విజయ్‌కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఖర్చులు విధించి కొట్టివేయాలని కోరారు. విజయ్‌కుమార్ తన పిటిషన్‌లో, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని ఆరోపించారు.
ఉపముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వ వాహనాలు, భద్రతా సిబ్బందిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజల డబ్బును వృథా చేయడమేనని అన్నారు. ఇంకా, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఆయనను సినిమాల్లో నటించకుండా ఆపాలని కోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది, ఎన్టీఆర్ కేసులో హైకోర్టు (High Court)ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉందని, దీనికి సమయం కావాలని కోర్టును కోరారు. దాంతో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి(Justice Venkata Jyotirmayi) ఈ కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు . ఇప్పుడు ఈ పిటిషన్‌పై విజయ్‌కుమార్ తరఫు వాదనలు ఏముంటాయి, హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అన్నది రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.