అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka | సాధారణంగా తేనెని చూస్తే ఎవరికైన కాస్త టేస్ట్ చేయాలనిపించడం సహజం. అయితే ఆ తేనెను ఇచ్చే తేనెటీగలు దగ్గరకు వస్తే మాత్రం చాలా మందికి భయం తప్పదు.
అయితే కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా పెర్నజే గ్రామానికి చెందిన రైతు కుమార్ మాత్రం ఈ భయాన్ని స్నేహంగా మార్చుకున్న వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆయనను స్థానికులు హనీ బియర్డ్ కుమార్ అని పిలుస్తున్నారు ఎందుకంటే ఆయన ముఖంపై గడ్డం మాదిరిగా తేనెటీగలు(Bees) నిండి ఉంటాయి. ఇది చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. కుమార్ తన నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో కృత్రిమ తేనెపట్టుల ద్వారా తేనె ఉత్పత్తి చేస్తున్నారు.
Karnataka | భయపడేదే లేదు..
ఆయనకు తేనెటీగలతో ఉన్న సంబంధం మాముల్ధి కాదు. అవి ఆయన శరీరంపై బస చేస్తుంటాయి, ఒక్కటి కూడా ఆయనకి ఎలాంటి హాని చేయవు . ఇతరులు తేనెటీగలకి ఆమడ దూరంలో ఉంటుండగా, కుమార్ మాత్రం వాటితో ఎంతో ఆత్మీయంగా ఉంటారు. తేనెటీగల మీద ప్రేమ, నమ్మకం, అవగాహన ఉండటం వల్ల అవి కూడా ఆయనను మిత్రుడిగా చూస్తున్నాయని చెబుతున్నారు స్థానికులు. కుమార్ కథ జాతీయ మీడియా(National Media) దృష్టిని కూడా ఆకర్షించింది. అనేక టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికలు ఆయనపై కథనాలు ప్రచురించాయి. ఆయన ప్రదర్శనల ద్వారా చిన్న పిల్లలు, యువత తేనెటీగల ప్రాముఖ్యత, వాటి జీవన శైలి గురించి నేర్చుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, పల్లె జీవన విధానం, ప్రకృతితో సమతుల్యంగా జీవించే మార్గాల గురించి కుమార్ జీవితం మనకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తోంది.
“ప్రకృతిలో ఏ జీవి మన శత్రువు కాదు. వాటిని అర్థం చేసుకుంటే అవే మన మిత్రులవుతాయి అని చెబుతున్న కుమార్… తాను తేనెటీగలతో గడిపే అనుభవం ద్వారా అందరికీ శాంతి, సహజీవన మార్గాన్ని నేర్పుతున్నారు. కుమార్ ముఖంపై వేలాది తేనెటీగలు కూర్చుని ఉన్న దృశ్యం చూసి అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఏ మాత్రం భయపడకుండా తేనెటీగలను ప్రేమతో చూస్తూ, వాటి మధ్య జీవించే ఆయన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.