అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavita) ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తొలిసారి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కవిత సస్పెన్షన్‌పై (Kavitha suspension) స్పందించారు. కవితపై తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. చర్యలు తీసుకున్నాక తాను మాట్లాడడానికి ఏమీ లేదని ఆయన చెప్పారు.
KTR | విడతల వారీగా దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) మూసీ సుందరీకరణ పేరిట విడతల వారీగా దోపిడీకి పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు అవసరం అని సీఎం అన్నారన్నారు. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.1 లక్ష 50 వేల కోట్లతో చెయ్యడమేంటని ప్రశ్నించడంతో విడతల వారీగా దోపిడీకి ప్లాన్ చేశారని విమర్శించారు. రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను (Godavari water) గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంప్‌హౌస్‌లు నిర్మించి అంచనా వ్యయాన్ని రూ.7,600 కోట్లకు పెంచిందని ఆరోపించారు. ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
KTR | తోక దగ్గర శంకుస్థాపన
రేవంత్‌రెడ్డి గండిపేటకు తెచ్చే నీళ్లు కాళేశ్వరం నుంచి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై విషం చిమ్మిందన్నారు. కక్ష కట్టి సీబీఐ విచారణకు (CBI inquiry ఆదేశించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కూలిపోయిందన్న అదే కాళేశ్వరం నుంచి ఇప్పుడు హైదరాబాద్‌కు నీళ్లు తెస్తున్నారని విమర్శించారు. నీళ్లు తీసుకువస్తున్న కొండ పోచమ్మ సాగర్, లేదంటే మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. పరువు పోతుందని సీఎం గండిపేట దగ్గర చేస్తున్నారన్నారు. తల దగ్గర చేయాల్సిన శంకుస్థాపన తోక దగ్గర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం జలాలను వినియోగించుకుంటేనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
KTR | సీఎం క్షమాపణ చెప్పాలి
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram project) ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీబీఐని తప్పు పడతారని, అదే సీబీఐకి కాళేశ్వరం విచారణను రేవంత్ ఎలా అప్పగించారని ఆయన ప్రశ్నించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS Party) పాల్గొనడం లేదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రైతుల (Telangana Farmers) కోసం యూరియా తేవాలని డిమాండ్ చేశామన్నారు. కానీ ఏ పార్టీ కావాల్సినంత యూరియా తీసుకు రాకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు.
KTR | తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు
హైదరాబాద్‌లోని చర్లపల్లి ఇటీవల మహారాష్ట్ర పోలీసులు (Maharashtra Police) రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకునే వరకు తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెలల తరబడి కార్మికులలా పని చేసి డ్రగ్స్ పట్టుకున్నారన్నారు.
ఇన్ని రోజులు ఆ డ్రగ్స్ కంపెనీపై ఏం చర్యలు తీసుకోలేదంటే, రేవంత్ రెడ్డికి ఏమైన ముడుపులు అందాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హోంమంత్రి శాఖ, ఈగల్ టీం (Eagle Team) ఏం చేస్తున్నాయని నిలదీశారు. మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ కంపెనీపై రైడ్స్ చేస్తుంటే.. తెలంగాణ పోలీసులు కేసీఆర్ పాటలు పెట్టిన డీజే బాక్సులు తీసుకుపోవడంలో, రీట్వీట్ కొట్టిన వారిపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.