అక్షరటుడే, ఇందూరు: GPO | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామపంచాయతీ అధికారుల (Gram Panchayat Officers) నియామకాలు చేపట్టింది. దీంతో సోమవారం జీపీఓలకు జిల్లా కలెక్టరేట్లో కౌన్సెలింగ్ నిర్వహించారు.
జిల్లాలో మొత్తం 301 మందికి నియామక పత్రాలు అందజేశారు. అయితే వీరికి రెవెన్యూ గ్రామల వారీగా 327 క్లస్టర్ల పరిధిలో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇకపై రెవెన్యూపరంగా జీపీఓలు పరిపాలన చేయనున్నారు.
GPO | రెవెన్యూ శాఖలో..
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో (Revenue Department) కొత్తగా 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO)లు ఎంపికయ్యారు. వారికి సెప్టెంబర్ 5న హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల్లో నియమితులైన జీపీఓలు అందరితో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) “భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్దంగా పని చేస్తానని” ప్రతిజ్ఞ చేయించారు.
GPO | గ్రామ పరిపాలనలో జీపీఓలే కీలకం..
గ్రామ పరిపాలనలో జీపీఓలే కీలకంగా మారనున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గతంలో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ అంటేనే అవినీతి అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముద్ర వేసిందని.. ప్రస్తుతం నియమింపబడ్డ జీపీఓలు ఆ ముద్ర చెరిపేసేవిధంగా గ్రామ పాలన సాగించాలని వారు పేర్కొన్నారు.