అక్షరటుడే, వెబ్‌డెస్క్: Red Sea | ఎర్ర సముద్రంలో అండర్‌సీ ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్థాన్ (Pakistan) సహా పలు మధ్యప్రాచ్య దేశాలు ఇంటర్నెట్ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ ఘటనపై అంతర్జాతీయ నెట్‌వర్క్ మానిటరింగ్ సంస్థ నెట్‌బ్లాక్స్ (NetBlocks) ప్రకటన విడుదల చేసింది.ఈ సమస్య వల్ల పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, యెమెన్ వంటి దేశాల్లో ఇంటర్నెట్ వేగం గణనీయంగా తగ్గిపోయినట్లు నెట్‌బ్లాక్స్ పేర్కొంది. జెడ్డా సమీపంలో ఈ సముద్ర కేబుల్స్ డ్యామేజ్ అయినట్టు ప్రాథమిక సమాచారం.
Red Sea | ఎలా తెగాయి ఈ కేబుల్స్?
ప్రస్తుతం ఈ కేబుల్స్ (Cables) ఎలా తెగాయని స్పష్టంగా తెలియకపోయినా, ఇంటెన్షనల్ సాబోటేజ్ కోణాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ కావచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్(Israel)పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు హౌతీలు ఈ దాడులకు పాల్పడి ఉంటారని సమాచారం. అయితే ఇప్పటివరకు హౌతీ గ్రూప్ ఈ ఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేబుల్స్ కట్ కావడంతో వందలాది కోళ్ల డేటా ట్రాఫిక్ ప్రభావితమవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్ వ్యవస్థలు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి.
ఇది మొదటిసారి కాదు. గతంలోనూ హౌతీ రెబెల్స్‌పై ఇదే తరహా ఆరోపణలు వచ్చినప్పటికీ, వారు ఖండించారు. అయితే ఈసారి కూడా వారు నిస్సందేహంగా పాల్గొన్నారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలో ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడినట్లు ధృవీకరించినా, కారణాలపై మాత్రం పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు.
అలాగే సౌదీ అరేబియా(Saudi Arabia), యూఏఈలో (UAE) కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌తో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై సంబంధిత ప్రభుత్వాలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించాయి. సముద్ర కేబుల్స్ మరమ్మతులు చేయడానికి ఇంటర్నేషనల్ టెలికాం సంస్థలు (International telecom companies) చర్యలు తీసుకుంటున్నాయి.