అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapally | ఇందల్వాయి (Indalwai) మండలం వర్షాకాలం వచ్చిందంటే పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంది. మండలంలోని సిర్నాపల్లి జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం వీకెండ్ స్పాట్‌గా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోన్న ఈ ప్రాంతం అందాలను మాటల్లో వర్ణించలేమంటే అతిశయోక్తి కాదు.
Sirnapally | క్యూ కడుతున్న పర్యాటకులు
సిర్నాపల్లి జానకీబాయ్ అలుగు (Sirnapalli Janakiboy Alugu) జలపాతం వద్ద ప్రకృతి ప్రేమికులు సందడి చేస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రజలు జలపాతం వద్దకు తరలి వచ్చారు.
Sirnapally | ఆహ్లాదకరమైన వాతావరణంలో..
వాతావరణం ఆదివారం పొడిగా ఉండడంతో పెద్దఎత్తున సందర్శకులు అలుగు వద్దకు తరలివచ్చారు. దీంతో సిర్నాపల్లి అటవీ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. జలపాతం వద్ద సేదదీరిన ప్రజలు అనంతరం అటవీ ప్రాంతంలోనే వంటలు చేసుకొని వనభోజనాలు చేశారు.
Sirnapally | వాహనాలన్నీ సిర్నాపల్లి వైపే..
జలపాతాన్ని తిలకించేందుకు వచ్చిన జనాలతో గన్నారం నుంచి సిర్నాపల్లి వెళ్లే రోడ్డు ఆదివారమంతా వాహనాల రాకపోకలతో రద్దీగా మారింది. సిర్నాపల్లి గ్రామం నుంచి జలపాతానికి వెళ్లేందుకు రోడ్డు కంకరతేలి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం స్పందింది ఈ మార్గంలో రోడ్డు నిర్మించాలని పర్యాటకులు కోరుతున్నారు.