అక్షరటుడే, వెబ్‌డెస్క్: Japan Prime Minister | జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా (Japan Prime Minister Shigeru Ishiba) రాజీనామా చేయనున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో నెలకొన్న అంతర్గత కలహాల నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని జపాన్ అధికారిక టీవీ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(Liberal Democratic Party)లో చీలికను నివారించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారని తెలిపింది. జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార పార్టీ, సంకీర్ణ భాగస్వామి కొమైటో ఓటమి తర్వాత మెజార్టీ కోల్పోయింది. ఈ క్రమంలో పార్టీలో విభేదాలు పొడసూపడంతో ప్రధాని రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
Japan Prime Minister | ఓటమి తర్వాత విభేదాలు..
పార్లమెంట్‌లో తన పార్టీకి భారీ ఎన్నికల ఎదురుదెబ్బ తగిలిన నెల రోజుల తర్వాత అపానీస్ ప్రధాన మంత్రి ఇషిబా షిగెరు ఆదివారం తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. జూలై ప్రారంభంలో జపాన్ పార్లమెంట్ (Japan Parliament) ఎగువ సభలో అధికార పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మెజారిటీని సాధించడంలో విఫలమైన ప్రధాని ఇషిబా సామర్థ్యంపై అనుమానాలు పెరిగాయి. గతేడాది జరిగిన పార్లమెంటు దిగువ సభలో కూడా పార్టీ మెజారిటీని సాధించడంలో విఫలమయ్యారు. రెండు సభల్లో మెజార్టీ కోల్పోయినప్పటికీ రాజకీయ ప్రతిష్టంభనను నివారించడానికి ప్రధానిగా కొనసాగుతానని ఇషిబా తెలిపారు.
అమెరికా సుంకాలతో (America Tarrifs) పాటు ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, జాతీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో రాజీనామా చేయడానికి నిరాకరించారు. ఓటమికి తనదే బాధ్యత అని అంగీకరించినప్పటికీ గద్దె దిగేందుకు ఆయన ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఎల్‌డీపీ కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంతో ఇషిబా పునరాలోచనలో పడ్డారు. పార్టీలో చీలక వస్తుందన్న భావన ఏర్పడడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.