అక్షరటుడే, వెబ్డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వినాయక నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి విగ్రహాలను భక్తులు చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు.
నగరంలోని 20 చెరువులు, కృత్రిమ కొలనుల్లో విగ్రహాల నిమజ్జనం చేపడుతున్నారు. లక్షలాది విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం ఉదయం వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా రోడ్డుపై పేరుకుపోయిన చెత్త తొలగిస్తున్న పారిశుధ్య కార్మికులిని టస్కర్ వాహనం ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
వినాయక నిమజ్జనం కోసం వచ్చిన టస్కర్ వాహనం ఢీకొనడంతో పారిశుధ్య కార్మికురాలు రేణుక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బషీర్‌బాగ్-లిబర్టీ మార్గంలో జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
Ganesh Immersion | కొనసాగుతున్న నిమజ్జనం
హైదరాబాద్ నగరంలో నిమజ్జనం కొనసాగుతోంది. నగరవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.60 లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) వద్ద భారీ సంఖ్యలో గణనాథులు బారులు తీరాయి. దీంతో ఆదివారం రాత్రి వరకు నిమజ్జనం సాగే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు విగ్రహాల వ్యర్థాలను వెంటవెంటనే తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 11 వేట టన్నుల వ్యర్థాలు తొలగించి జవహర్ నగర్లోని ప్రాసెసింగ్ సెంటర్కు తరలించారు.