అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి (Cherlapalli) పారిశ్రామిక వాడలో కొందరు నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఇందులో రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
Hyderabad | దేశంలోనే పెద్ద నెట్వర్క్
పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. దేశంలోనే వీరిది పెద్ద డ్రగ్ నెట్‌వర్క్‌గా భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా వీటిని తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర (Maharashtra)లోని మీరా రోడ్ పోలీసులు డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. 32 వేల లీటర్ల లిక్విడ్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఆపరేషన్‌లో మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.
Hyderabad | రహస్య ఆపరేషన్
మహారాష్ట్ర పోలీసులు మొదట దాడులు చేపట్టి 200 గ్రాముల ఎండీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.25 లక్షలు. అనంతరం వారు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపట్టడంతో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ముఠాలోకి తమ గూఢచారులను పంపించారు. కొన్ని రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించారు. అనంతరం చర్లపల్లిలోని ఫ్యాక్టరీపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
Hyderabad | 13 మంది అరెస్ట్
చర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్స్ పేరిట నకిలీ లైసెన్స్‌తో నిందితులు ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. కానీ లోపల మాత్రం పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్యాక్టరీపై దాడి చేసి రసాయన పరికరాలు, డ్రగ్ ఉత్పత్తి యూనిట్లు, 32 వేల లీటర్ల ప్రికర్సర్ కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ విదేశీయుడు సహా 12 మందిని అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ యజమాని, రసాయన శాస్త్ర నిపుణుడు శ్రీనివాస్, అతని సహచరుడు తనాజీ పాఠేను కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 గ్రాముల ఎండీ, రూ. 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.