అక్షరటుడే, వెబ్డెస్క్ : Red Fort | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గల ఎర్రకోటలో దొంగలు పడ్డారు. పటిష్ట భద్రత ఉండే కోటలో రూ.కోటి విలువైన కలశాలను ఎత్తుకెళ్లారు.
కోట ప్రాంగణంలో వ్యాపారవేత్త సుధీర్ జైన్ దసలక్షణ మహాపర్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ పూజా క్రతువులో వినియోగించడానికి తీసుకొచ్చిన కలశాలను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సెప్టెంబర్ 3న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Red Fort | పూజారి రూపంలో వచ్చి..
ఎర్రకోటలో సెప్టెంబర్ 3న ఉదయం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజల కోసం వ్యాపారవేత్త సుధీర్ జైన్ (Sudheer Jain) 760 గ్రాముల బంగారు కలశం, బంగారు కొబ్బరికాయ, వజ్రాలు, పచ్చలు, మాణిక్యాలతో పొదిగిన 115 గ్రాముల మరో బంగారు కలశం తీసుకొచ్చారు. వీటిని జైన ఆచారాలలో ఉపయోగిస్తారు. దీంతో పవిత్రంగా భావిస్తారు. అయితే జైన పూజారి వేషంలో వచ్చిన ఓ వ్యక్తి వాటిని సంచిలో వేసుకొని మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు.
Red Fort | వారిని ఆహ్వానించడానికి వెళ్లగా..
పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. నిర్వాహకులు వారిని ఆహ్వానించడాని వెళ్లిన సమయంలో దొంగ కలశాలను ఎత్తుకెళ్లాడు. పూజ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన తర్వాత వస్తువులు లేవని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. జైన పూజారి వేషంలో వచ్చిన వ్యక్తి పూజాసామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి.. కలశాలను సంచిలో వేసుకొని వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. అయితే నిందితుడు గతంలో సైతం పలు ఆలయాల్లో దొంగతనానికి యత్నించినట్లు సమాచారం. త్వరలో దొంగను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.