అక్షరటుడే, మెదక్ : Edupayala | జిల్లాలోని పాపన్నపేట మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం (Durga Temple) ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. మంజీర ఉధృతంగా పారుతుండటంతో అధికారులు ఆలయాన్ని మూసి ఉంచారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు (Singuru)కు ఇన్ఫ్లో వస్తోంది. సింగూరు జలాశయంలో ఎక్కవ మొత్తంలో నీరు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ అధికారులు సూచించారు. దీంతో ప్రాజెక్ట్ అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా మంజీర (Manjeera)లోకి నీటిని వదులుతున్నారు.
Edupayala | 24 రోజులుగా..
సింగూరు నుంచి వచ్చిన నీటితో ఏడుపాయలలోని ఘనపురం ఆనకట్టపై నుంచి నీరు పొంగి పొర్లుతోంది. ఆలయం ఎదుట నుంచి మంజీర ఉధృతంగా పారుతోంది. దీంతో అధికారులు ఆలయాన్ని మూసి ఉంచారు. 24 రోజులుగా అమ్మవారి ఆలయం మూసి ఉంది. మొన్నటి వరకు మంజీర ఉగ్రరూపం దాల్చగా.. తాజాగా కాస్త శాంతించింది. వరద తగ్గిన ఆలయం ముందు నుంచి ప్రవాహం కొనసాగుతుండటంతో గుడిని మూసి ఉంచారు.
Edupayala | రాజగోపురంలో పూజలు
ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని మూసివేసిన అధికారులు.. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. మంజీర పరవళ్లు తొక్కుతుండటంతో, ఏడుపాయల ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతుండంటో భక్తులు భారీగా వెళ్తున్నారు. మొన్నటి వరకు వరద ఉధృతి అధికంగా ఉన్న సమయంలో ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించలేదు. ప్రస్తుతం వరద తగ్గడంతో రాజగోపురంలో అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
మంజీర నది ఉధృతంగా పారుతుండటంటో ఘనపురం ఆనకట్టపైకి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. అలాగే దిగువన ఆలయ సమీపంలో సైతం నీళ్లలోకి దిగకుండా చర్యలు చేపట్టారు. భక్తులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.