అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balapur Ganesh | లడ్డూ వేలం అనగానే గుర్తొచ్చిది బాలాపూర్ వినాయకుడు. ఏళ్లుగా ఈ వినాయకుడి లడ్డూ భారీ ధర పలుకుతోంది.
వినాయక చవితి సందర్భంగా కొలువుదీరిన గణనాథుల చేతిలోని లడ్డూను వేలంలో దక్కించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. దీంతో గ్రామాల నుంచి నగరాల వరకు లడ్డూ కోసం వేలం పాట నిర్వహిస్తారు. అయితే బాలాపూర్ లడ్డూకు ప్రత్యేకత ఉంది. ఏళ్లుగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధరకు భక్తులు లడ్డూను దక్కించుకుంటున్నారు.
Balapur Ganesh | రూ.35 లక్షలు పలికిన లడ్డూ
బాలాపూర్ (Balapur) గణేశుడి లడ్డూ వేలం ప్రక్రియను శనివారం ఉదయం నిర్వహించారు. వేలంపాటలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పోటీ పడి లడ్డూ ధరను పెంచుకుంటూ పోయారు. చివరకు లింగాల దశరథ్ గౌడ్ (Lingala Dasharath Goud) అనే వ్యక్తి రూ.35 లక్షలకు లడ్డూ దక్కించుకున్నాడు.
Balapur Ganesh | గతంలో..
బాలాపూర్ గణనాథుడికి లడ్డూకు ఏళ్లుగా డిమాండ్ ఉంది. ప్రతిసారి లడ్డూ వేలంలో పెద్ద పెద్ద నేతలు, వ్యాపారులు పాల్గొంటారు. గతేడాది 30.01 లక్షలకు కొలను శంకర్‌రెడ్డి (Kolanu Shankar Reddy) లడ్డూ దక్కించుకున్నాడు. ఈ సారి మరో రూ.5 లక్షల ధర అదనంగా పలకడం గమనార్హం. 1994లో రూ.450తో బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. 2023లో బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలు పలికింది.
లడ్డూ దక్కించుకున్న కర్మాన్‌ఘాట్‌కు చెందిన దశరథ్ గౌడ్ మాట్లాడుతూ.. బాలాపూర్ గణేశ్ లడ్డూ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. 2019 నుంచి లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు దయదలిచాడని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.