అక్షరటుడే, వెబ్డెస్క్ : Ganesh Laddu | వినాయక చవితి సందర్భంగా నిర్వహించే గణేష్ లడ్డూ వేలంపాటలు ఈ ఏడాది మరోసారి సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ – కీర్తి రిచ్మండ్ విల్లాస్(Kirti Richmond Villas) లో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంలో, రికార్డు ధర పలికింది.
పదికేజీల లడ్డూను స్థానికులు ఏకంగా రూ. 2,31,95,000కి కొనుగోలు చేశారు. ఇది ఇప్పటివరకు నమోదైన తెలంగాణ గణేష్ లడ్డూ(Ganesh Laddu) వేలాల్లో అత్యధిక ధర కావడం విశేషం. గత ఏడాది ఇదే కమ్యూనిటీ లడ్డూ రూ. 1.87 కోట్లు పలికింది. ఈసారి వేలం పాట రూ. 1 కోటి ప్రారంభ ధరతో ప్రారంభమైంది. 80 కి పైగా విల్లా యజమానులు నాలుగు గ్రూపులుగా విభజించబడి దాదాపు 500 బిడ్లు వేశారు. ఉత్సాహభరితంగా జరిగిన ఈ వేలం రెండు గంటలకు పైగా సాగింది.
అవిష్కరణ నుంచి రికార్డుల వరకు – బండ్లగూడ లడ్డూ చరిత్ర:
- 2018: రూ. 25,000
- 2019: రూ. 18.75 లక్షలు
- 2020: (కోవిడ్ కారణంగా వేలం జరగలేదు)
- 2021: రూ. 41 లక్షలు
- 2022: రూ. 60 లక్షలు
- 2023: రూ. 1.26 కోట్లు
- 2024: రూ. 1.87 కోట్లు
- 2025: రూ. 2.31 కోట్లు
ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం వినియోగించటం ఒక మంచి సంప్రదాయంగా మారింది. హైదరాబాద్(Hyderabad)కి చెందిన రాయదుర్గం – మై హోమ్ భుజా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే లడ్డూ వేలం కూడా ప్రఖ్యాతి పొందినది. ఈ ఏడాది లడ్డూను ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేశ్ కొనుగోలు చేశారు. ఆయన రూ. 51,07,777 చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్నారు.గతేడాది కూడా ఇదే వ్యాపారి ఈ లడ్డూను రూ. 29 లక్షలకు దక్కించుకున్నారు. వరుసగా రెండు సంవత్సరాలు మై హోమ్ భుజా లడ్డూ(My Home Bhuja Laddu)ను అత్యధిక ధరకు సొంతం చేసుకున్న వ్యక్తిగా గణేశ్ రికార్డు సృష్టించారు.
గణేష్ నవరాత్రులలో లడ్డూ వేలం(Laddu Auction) పాటలు ఆధ్యాత్మికతకు తోడు సామాజిక సేవకు నడుం కడుతున్న ప్రక్రియగా మారినట్టు స్పష్టమవుతోంది. భక్తులు ఉత్సాహంగా పాల్గొనడం, వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది.