అక్షరటుడే, వెబ్డెస్క్ : Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా(Raj Kundra)కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.60 కోట్ల చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ జంటపై లుకౌట్ నోటీసు (LOC) జారీ చేశారు. వీరిద్దరిపై ఆగస్టు 14న జుహు పోలీస్ స్టేషన్లో(Juhu Police Station) కేసు నమోదు చేయబడింది.
ఈ జంట తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నందున నగర పోలీసుల ఆర్థిక నేరాల విభాగం LOC జారీ చేసింది. ముంబై పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఆర్థిక నేరాల విభాగం ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తోంది. లుకౌట్ సర్క్యులర్ (Lookout Circular) అనేది ఎవరైనా దేశం విడిచి వెళ్లకుండా ఆపడానికి లేదా వారి కదలికలను ట్రాక్ చేయడానికి ఉపయోగించే నోటీసు. సదరు వ్యక్తులపై నిఘా ఉంచమని ఇది ఇమ్మిగ్రేషన్, సరిహద్దు అధికారులను హెచ్చరిస్తుంది.
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు..
శిల్పా శెట్టి(Shilpa Shetty), రాజ్ కుంద్రా తమను రూ.60.4 కోట్లు మోసం చేశారని ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఆరోపించారు. 2015 నుంచి 2023 మధ్య రుణంగా, ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్'(Best Deal TV Private Limited) అనే కంపెనీలో పెట్టుబడిగా వారికి ఇచ్చానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, వారు ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, శిల్పా తరపున న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ఈ వాదనలకు ప్రతిస్పందిస్తూ, ఈ కేసును 2024లో NCLT ముంబైలో విచారించామని, ఇది పాత లావాదేవీ అని పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి నేరం లేదని, మొత్తం పరిస్థితి సివిల్ స్వభావం కలిగి ఉందని వాదించారు. ఆడిటర్లు దర్యాప్తు సంస్థలకు అన్ని పత్రాలు, నగదు లావాదేవీల వివరాలను అందించారన్నారు.