అక్షరటుడే, వెబ్డెస్క్ : Lunar Eclipse | భాద్రపద పౌర్ణమి రోజున అంటే ఈనెల 7న అరుదైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దృక్ పంచాంగం ప్రకారం ఆదివారం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది.
గ్రహణ వ్యవధి 3.28 నిమిషాలు. రాత్రి 11:42 గంటల సమయానికి చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం(Lunar eclipse). గతంలో ఒకటి రెండు గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు. దీంతో వాటి ప్రభావం మన దేశంలో లేదు. ఈ ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం మన దేశంలో కనిపించనుంది.
Lunar Eclipse | చంద్ర గ్రహణం అంటే..
భూమి, సూర్యుడు, చంద్రుడు(Moon) ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన. గ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడడం వల్ల చంద్రుడు కనిపించడు. లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ సంఘటనకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చంద్రుడు మానసిక స్థితి, భావోద్వేగాలు, ప్రశాంతతను సూచిస్తాడు. ఈసారి చంద్రగ్రహణం ఆసియా ఖండంలోని భారత్(Bharath)తో సహా రష్యా, సింగపూర్, చైనా వంటి దేశాల్లో కనబడనుంది.
Lunar Eclipse | సూతక కాలంలో ఏం చేయాలి?
హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు నుంచి గ్రహణం విడిచేంతవరకు ఉండే సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు. ఎలాంటి పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి తలుపులు తెరిచి పూజలు చేస్తారు. రాహుకేతు(Rahu Ketu) పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటాయి.
Lunar Eclipse | ఏ నియమాలు పాటించాలంటే…
సనాతన ధర్మాన్ని(Sanatana Dharmam) ఆచరించే వారు సాయంత్రం 6 గంటలలోపు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని, గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరాదని పేర్కొంటున్నారు. అలాగే చంద్ర గ్రహణం(Chandra Grahanam) సమయంలో నిద్రపోవద్దని శాస్త్రం చెబుతోంది.
గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందన్నది ప్రజల నమ్మకం.
చంద్ర గ్రహణ సమయంలో ధ్యానం, జపం వంటివి ఆచరించాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఈ చంద్ర గ్రహణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. చాలామంది గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేస్తారు. గ్రహణ పట్టు, విడుపు స్నానాలు ఆచరించడం వల్ల గ్రహణ దోషాలు అంటకుండా ఉంటాయని నమ్ముతారు.
Lunar Eclipse | దానాలు శ్రేష్టం..
చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. ఈ సందర్భంగా శక్తిమేరకు వస్త్రాలు, ఆహారం, డబ్బు దానం చేయాలి. గ్రహణ సమయంలోనూ, ఆ తర్వాతా చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని ప్రజలు నమ్ముతారు.