అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan bans Bollywood songs : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌లోని అన్ని ఎఫ్ఎం రేడియో స్టేషన్లలో భారతీయ(బాలీవుడ్) పాటల ప్రసారాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (పీబీఏ) ప్రకటించింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల సంబంధాలు పూర్తిగా క్షీణించాయి.
పీబీఏ సెక్రటరీ జనరల్ షకీల్ మసూద్ గురువారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. “పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఉన్న పాక్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారం నిలిపివేసింది” అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి, లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, ముఖేష్, కిషోర్ కుమార్ వంటి దిగ్గజ గాయకుల పాటలతో సహా భారతీయ సంగీతానికి పాకిస్తాన్లో ఎంతో ఆదరణ ఉంది. అక్కడి ఎఫ్ఎం లలో నిత్యం భారతీయ పాటలు ప్రసారమవుతుంటాయి.
ఏప్రిల్ 22న పహల్గావ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఖండించి, భారత్‌కు సంఘీభావం తెలిపారు.
పహల్గావ్ దాడికి సరిహద్దు ఆవల నుంచి సంబంధాలున్నాయని ఆరోపిస్తూ భారత్.. పాకిస్తాన్‌పై పలు కఠిన ఆంక్షలు విధించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ భూ సరిహద్దు మార్గాన్ని మూసివేయడం, దౌత్య సంబంధాలు తగ్గించుకోవడం వంటి చర్యలను భారత్ తీసుకుంది. భారత్ గగనతలంపై పాకిస్తానీ విమానాలపై నిషేధం విధించింది.