అక్షరటుడే, వెబ్‌డెస్క్: GST | జీఎస్టీ లో తీసుకువచ్చిన సంస్కరణలతో చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను భారం 10 శాతం తగ్గనుంది. దీంతో వాటికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. జీఎస్టీ శ్లాబ్‌ల మార్పుతో ఏ ఏ కార్ల ధరలు తగ్గుతాయో తెలుసుకుందామా..
1500 సీసీలోపు ఉన్న డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు (Diesel hybrid cars), 1200 సీసీలోపు పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ కార్లు గతంలో 28 శాతం జీఎస్టీ శ్లాబ్(GST slab) పరిధిలో ఉండేవి. వీటిపై 10 శాతం పన్ను తగ్గించి 18 శాతం శ్లాబ్ పరిధిలోకి తెచ్చారు. అయితే గతంలో ఉన్నట్లే ఇంధనం(Fuel), ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి మూడు శాతం వరకు సెస్ విధించనున్నారు. నూతన శ్లాబ్ ప్రకారం టాటా అల్ట్రోజ్ (Tata Altroz), హ్యుందాయ్ ఐ10, 120, రెనో క్విడ్ వంటి కార్ల ధరలు తగ్గనున్నాయి. చిన్న కార్లపై లక్ష రూపాయల వరకు పన్ను భారం తగ్గే అవకాశాలున్నాయి.
GST | వీటిపై పన్ను పెరిగినా లాభమే!
మధ్యశ్రేణి, భారీ ఎస్‌యూవీ(SUV)లపై పన్ను భాగం 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. అయితే సెస్ (Cess) భారం తగ్గనుంది. ప్రస్తుతం వీటిపై 28 శాతం జీఎస్టీతోపాటు 17 నుంచి 22 శాతం వరకు సెస్ విధిస్తున్నారు. కొత్త శ్లాబ్ ప్రకారం జీఎస్టీ 40 శాతానికి చేరుతుంది. అదనంగా సెస్ ఉండదు. దీంతో మధ్యశ్రేణి, భారీ ఎస్‌యూవీల రేట్లూ కాస్త తగ్గే అవకాశాలున్నాయి. ఈ కేటగిరిలో టాటా హారియర్ (Tata Harrier), మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మారుతీ గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా వంటి వాహనాలున్నాయి.
GST | పల్సర్ ప్రియులకు గుడ్ న్యూస్..
బజాజ్ పల్సర్ (Bajaj Pulsar), హీరో స్ప్లెండర్ వంటి వాహనాలపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గనుంది. దీంతో వీటికి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల ఇంజిన్ ఉండే ఎన్‌ఫీల్డ్, కేటీఎం(KTM) వంటి బైకులు ప్రీమియం శ్రేణి కిందకు వస్తాయి. వీటిపై జీఎస్టీ భారం పెరగనుంది. గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. మరో 12 శాతం కలిపి 40 శాతానికి పెంచనున్నారు. అదనంగా 3 శాతం సెస్సు విధించనున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై ఐదు శాతం జీఎస్టీ కొనసాగనుంది.