అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) ప్రవేశ పెట్టింది. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసింది. అయితే ఇళ్ల విషయంలో కొందరు అధికారులు లంచాలు తీసుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సమయంలో పలువురు అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. బేస్మెంట్ లెవల్ వరకు పూర్తయితే రూ.లక్ష ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే బిల్లుల చెల్లింపు కోసం సైతం పలువురు పంచాయతీ కార్యదర్శలు డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇల్లు బిల్లు కోసం లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ (ACB) అధికారులు పట్టుకున్నారు.
ACB Raid | రూ.20 వేలు డిమాండ్
మంచిర్యాల (Mancherial) జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అక్కల వెంకట స్వామి పనిచేస్తున్నారు. గ్రామంలో ఓ వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేశాడు. ప్రభుత్వం నుంచి రూ.లక్ష బిల్లు కోసం బేస్మెంట్ ఫొటోలు తీసి, ఇంటి నిర్మాణ పురోగతిని యాప్లో అప్లోడ్ చేయడానికి కార్యదర్శి రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు బాధితుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా.. జీపీ కార్యదర్శి వెంకటస్వామిని ఏసీబీ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.