అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | జీఎస్టీ(GST) సరళీకరణ కోసం రెండు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గిస్తారన్న అంచనాలతో ఈ రంగంలోని షేర్లు లాభాల బాటలో పయనించాయి. ఆటో, ఫార్మా(Pharma) రంగాల షేర్లూ రాణించాయి. దీంతో ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి.
బుధవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 138 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అక్కడినుంచి 291 పాయింట్లు పడిపోయినా తేరుకుని క్రమంగా 667 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 37 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై.. వెంటనే 83 పాయింట్లు క్షీణించింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి కోలుకుని 204 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 409 పాయింట్ల లాభంతో 80,567 వద్ద, నిఫ్టీ(Nifty) 135 పాయింట్ల నష్టంతో 24,715 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,624 కంపెనీలు లాభపడగా 1,484 స్టాక్స్ నష్టపోయాయి. 162 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 126 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 64 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 2.44 లక్షల కోట్లమేర పెరిగింది.
మెటల్ షేర్లకు రెక్కలు..
చైనా తన ఉక్కు ఉత్పత్తిని తగ్గిస్తుండడంతో మెటల్ షేర్లకు రెక్కలొచ్చాయి. బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్(Metal index) ఏకంగా 3.08 శాతం పెరిగింది. కమోడిటీ ఇండెక్స్ 1.53శాతం, హెల్త్‌కేర్ 1.20 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.05 శాతం, కమోడిటీ 0.83 శాతం, ఫినాన్షియల్ సర్వీసెస్ 0.73 శాతం, ఆటో, బ్యాంకెక్స్ 0.71 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.62 శాతం పెరిగాయి. ఐటీ ఇండెక్స్ మాత్రమే 0.70 శాతం పడిపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.90 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం పెరిగాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో, 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్ 5.90 శాతం, టైటాన్ 1.73 శాతం, ఎంఅండ్‌ఎం 1.62 శాతం, ఐటీసీ 1.19 శాతం, ఎటర్నల్ 1.16 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 1.19 శాతం, ఎన్టీపీసీ 0.55 శాతం, హెచ్‌యూఎల్ 0.49 శాతం, టీసీఎస్ 0.45 శాతం, అదాని పోర్ట్స్ 0.36 శాతం నష్టపోయాయి.