అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | కాంగ్రెస్, ఆర్జేడీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. తల్లులు, మహిళలను కూడా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని తల్లిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
తాజాగా.. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ అవమానం తన తల్లికి మాత్రమే కాదు, బీహార్ తల్లులు, కుమార్తెలకు కూడా అవమానమని పేర్కొన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ వేదిక నుంచి తన తల్లిని కించపరుస్తున్నారని ఎవరూ ఊహించలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బీహార్ రాజ్య జీవిక నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై (Congress Party) తీవ్ర విమర్శలు చేశారు.
PM Modi | అమ్మపై అనుచిత వ్యాఖ్యలా?
అమ్మే మన ప్రపంచమని, అమ్మే మన ఆత్మగౌరవమని, అలాంటింది బీజేపీ, కాంగ్రెస్ నేతలు కలిసి తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మోదీ మండిపడ్డారు. “అమ్మే మన ప్రపంచం. అమ్మే మన ఆత్మగౌరవం. ఈ సంప్రదాయాలకు నిలయమైన బీహార్‌లో కొన్ని రోజుల క్రితం ఏమి జరిగిందో చూశారు. బీహార్‌లోని ఆర్జేడీ – కాంగ్రెస్ (RJD-Congress) ద్వయం నా తల్లిని కించపరించింది. ఈ వేధింపులు నా తల్లికి జరిగిన అవమానం మాత్రమే కాదు. ఇవి దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు జరిగిన అవమానం. దీన్ని చూసిన తర్వాత బీహార్‌లోని ప్రతి తల్లి ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. నా హృదయంలో నాకు ఎంత బాధ ఉందో, బీహార్ ప్రజలు కూడా అదే బాధలో ఉన్నారని నాకు తెలుసు” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
PM Modi | చనిపోయిన తల్లిపై విమర్శలా?
తన తల్లికి రాజకీయాలతో సంబంధం లేకపోయినప్పటికీ, ఆర్జేడీ-కాంగ్రెస్ ఎందుకు అవమానించిందని ప్రధాన మంత్రి ప్రశ్నించారు. “మీలాంటి కోట్లాది మంది తల్లులకు సేవ చేయడానికి నా తల్లి నన్ను ఆమె నుంచి వేరు చేసింది. ఇప్పుడు నా తల్లి జీవించి లేదని మీకు తెలుసు. కొంతకాలం క్రితం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆమె మనందరినీ విడిచిపెట్టింది. రాజకీయాలతో సంబంధం లేని నా తల్లిని ఆర్జేడీ-కాంగ్రెస్ ద్వయం తీవ్రంగా అవమానించింది. సోదరీమణులారా, తల్లులారా, మీరు అనుభవించిన బాధను నేను ఊహించగలను. కొంతమంది తల్లుల కళ్లలో కన్నీళ్లు చూడగలను. ఇది చాలా విచారకరం, బాధాకరమైనది” అని అన్నారు.
PM Modi | ఎంతో కష్టపడి పెంచింది..
తన తల్లి సంవత్సరాలుగా ఎదుర్కొన్న పోరాటాలను గుర్తుచేసుకుంటూ, దేశవ్యాప్తంగా కోట్లాది మంది తల్లులకు సేవ చేయడానికి ఆమె తనను తన నుండి వేరు చేసిందని ప్రధానమంత్రి అన్నారు. తీవ్ర పేదరికం వెంటాడుతున్నా తన తల్లి ఎంతో కష్టపడి తమని పెంచిందని మోదీ తెలిపారు. “తీవ్ర పేదరికంలో నా తల్లి మమ్మల్ని కష్టపడి పెంచింది.. ఆమె ఎప్పుడూ తనకోసం కొత్త చీర కొనుక్కోలేదుజ మా కుటుంబం కోసం ప్రతి పైసా ఆదా చేసింది.
నా తల్లిలాగే, నా దేశంలోని కోట్లాది మంది తల్లులు ప్రతిరోజూ ‘తపస్సు’ చేస్తారు. అలాంటి త్యాగధనులను కించపరచడం భావ్యమా?” అని ప్రశ్నించారు. రాజకుటుంబంలో పుట్టిన యువరాజులు పేద తల్లుల బాధలు, పిల్లలు చేసే పోరాటాలను అర్థం చేసుకోలేరని విమర్శించారు. వారంతా గోల్డెన్ స్పూన్‌తో పుట్టారని, బీహార్‌లో (Bihar) తమకే అధికారం సొంతం కావాలనే స్వార్థంతో పని చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ పేద తల్లి కుమారుడిని ఆశీర్వదించి ప్రధానిని చేశారని, కానీ కొందరు నామ్‌దార్లు దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు.