అక్షరటుడే, వెబ్‌డెస్క్: PCC Chief | ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, పార్టీ నాటకంలో భాగమే కవిత డ్రామా అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. పదేళ్లు అధికారంలోకి ఉన్నప్పుడు కవితకు కాళేశ్వరంలో జరిగిన అవినీతి కనిపించలేదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్(KCR) కుటుంబంలోని వారంతా ఒక్కటేనని, ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో (Gandhi Bhavan) విలేకరులతో మాట్లాడిన పీసీసీ చీఫ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
PCC Chief | బీసీలకు బీజేపీ అన్యాయం
బీసీలకు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) తీవ్ర అన్యాయం చేస్తోందని మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన మూడు బిల్లులను అడ్డుకుంటోందని ఆరోపించారు. బీసీ ఓట్లతో గెలిచిన బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజకీయాలకు పాల్పడకుండా బీసీలకు న్యాయం చేయడానికి సహకరించాలని కోరారు.
PCC Chief | అప్పుడు తెలియదా?
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవితే చెబుతుందని పీసీసీ చీఫ్ (PCC Chief) అన్నారు. తాము కూడా ముందు నుంచి అదే చెబుతున్నామని, తాజాగా కవిత వ్యాఖ్యలతో నిజాలు బయటకు వచ్చాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం గురించి కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వాటాల్లో తేడాలు రావడంతోనే వివాదం మొదలైందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంపై చర్యలు తీసుకోవాలని కవిత ఎప్పుడైనా కేసీఆర్‌ను అడిగారా ? అని నిలదీశారు. హరీశ్‌రావు(Harish Rao) అవినీతికి పాల్పడ్డాడని చెబుతున్న కవిత.. కేసీఆర్‌కు తెలియకుండా అలాంటి పనులు చేస్తాడా? అని ప్రశ్నించారు. నిర్మాణంలో కాంట్రాక్టర్ల ప్రమేయం పరిమితమేనని, ప్రభుత్వానిదే పూర్తి అజమాయిషీ అని తెలిపారు. కాంట్రాక్ట్ సంస్థలు బీఆర్ఎస్కు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్లు ఎప్పుడు ఎవరు ఇచ్చారో అధికారికంగా ఉంటుందని, దానిపైనా విచారణ జరిపిస్తామని చెప్పారు.
PCC Chief | తప్పుడు ఆరోపణలు..
సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కవిత వెంట రేవంత్‌రెడ్డి ఉన్నారని కేటీఆర్ అంటున్నారు. హరీశ్ వెనుక రేవంత్ ఉన్నారని కవిత అంటున్నారు. మరి ఎవరి వాదన కరెక్ట్ అని ప్రశ్నించారు. అసలు కవిత (MLC Kavitha) ఎవరు కోన్ కిస్కా అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి ఎవరిని వెనుకేసుకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారమే వాస్తవాలు బయటకు తీసుకొచ్చామని చెప్పారు.
PCC Chief | ఎవరిపైనా కక్ష లేదు..
కాళేశ్వరంపై తాము విచారణ చేపట్టిన నాటి నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందే కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని చెప్పామని మహేశ్‌గౌడ్ గుర్తు చేశారు. వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం కేసీఆర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించవచ్చని, కానీ తాము నిష్పాక్షిపాతంగా ఉన్నామని చెప్పడానికే ప్రభుత్వం సీబీఐ విచారణకు (CBI Investigation) ఆదేశించిందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో సీబీఐ కొన్నిసార్లు తప్పుగా వ్యవహరించిందని, అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత సీబీఐపై ఉందన్నారు. హైకోర్టు చర్యలు చేపట్టవద్దని చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు. పీసీ ఘోష్ (PC Ghosh) నీతి నిజాయతీపరుడని కమిషన్ బాధ్యతలు అప్పగించామన్నారు. ఆయన అన్ని పరిశీలించాకే నివేదికను రూపొందించారని చెప్పారు. ఘోష్ కమిషన్‌పై నిర్ణయ తీసుకునే అధికారం ఇప్పుడు బీజేపీ పరిధిలోకి వెళ్లిందన్నారు.
PCC Chief | కుటుంబమంతా ఒక్కటే..
కేసీఆర్ కుటుంబమంతా ఒక్కటే. కవిత ఎపిసోడ్ అంతా నాటకంలో భాగమే. దోచిన సొత్తును పంచుకున్నారని పీసీసీచీఫ్ విమర్శించారు. వాటాల్లో పంపకాలు వస్తే వచ్చి ఉండొచ్చు. అందరం ఏకమై తమను తాము కాపాడుకోవడానికే కవిత ఈ డ్రామా ఆడుతున్నారని తెలిపారు. హరీశ్‌రావు అవినీతికి పాల్పడితే రెండోసారి మంత్రిగా ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. హరీశ్‌రావుకు అవినీతికి పాల్పడ్డాడని కవిత చెబుతున్నారని, కేసీఆర్‌కు తెలియకుండా ఆయన అవినీతికి ఎలా పాల్పడతారని ప్రశ్నించారు.
ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కవితను బహిష్కరిస్తున్నారన్న విలేకరుల ప్రశ్నపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ వ్యవహారాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. మొన్నటివరకూ కవిత వెనుక రేవంత్ ఉన్నారని, ఇప్పుడేమో హరీశ్ వెనుకకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమకు సమానమేనని, అవినీతికి పాల్పడిన వారిని ఎవరినీ ఉపేక్షించబోమన్నారు. అందరూ బంజారాహిల్స్‌లో ఉంటారని, అందరూ ఒకేచోటకు వెళ్తారని పేర్కొన్నారు.
PCC Chief | ట్యాపింగ్ కేసు కూడా ఇస్తాం..
ప్రజలు కోరుకున్నారు కాబట్టే కాళేశ్వరం అక్రమాలను బయటకు తీసుకొస్తున్నామని మహేశ్ చెప్పారు. సీబీఐ విచారణకు ఇన్నాళ్లు డిమాండ్ చేసిన బీజేపీ వాళ్ల సత్తా ఏమిటో ఇక తేలిపోతుందన్నారు. కాళేశ్వరంతో పాటు ట్యాపింగ్ కూడా చాలా పెద్ద నేరమన్నారు. అవసరమైతే ట్యాపింగ్ అంశాన్ని కూడా సీబీఐకి అప్పగిస్తామని చెప్పారు. అన్ని కేసులు సీబీఐకి ఇవ్వలేమని, ఒక్కో కేసు తీవ్రతను బట్టి ఇస్తామని తెలిపారు. చాలా మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని, వారందరినీ వదిలిపెట్టమని చెప్పారు. ట్యాపింగ్‌ను అడ్డం పెట్టుకుని నాయకులు చాలా వ్యవహారాలు నడిపారని అవన్నీ బయటకు రావాల్సి ఉందన్నారు.