అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | భారత్‌తో కయ్యానికి కాలువు దువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను బలి పెడుతూ తీసుకుంటున్న నిర్ణయాలపై నిరసన వెల్లువెత్తుతోంది.
రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులతో పాటు మేధావులు, మాజీ అధికారులు సైతం ట్రంప్‌పై (Donald Trump) మండిపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు, మాజీ అధికారులు ఇండియాను దూరం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్న వేళ తాజాగా కాలిఫోర్నియా గవర్నర్‌తో (California Governor) పాటు మాజీ జాతీయ భధ్రత సలహాదారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Donald Trump | పాక్‌తో వ్యాపారం కోసమే..
పాకిస్తాన్‌తో స్నేహం కోసం భారత్‌ను దూరం చేసుకుంటున్నారని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాకబ్ జెరెమియా ట్రంప్‌ను విమర్శించారు. పాకిస్తాన్‌లోని (Pakistan) తన కుటుంబ వ్యాపారాల కోసం భారతదేశంతో అమెరికా సంబంధాలను అధ్యక్షుడు ట్రంప్ ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించారు. వాషింగ్టన్-న్యూఢిల్లీ సంబంధాన్ని త్యాగం చేయాలనే ట్రంప్ చర్యను అమెరికా సొంత ప్రయోజనాలకు భారీ వ్యూహాత్మక ముప్పుగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో (India) ద్వైపాక్షిక ప్రాతిపదికన సాంకేతికత, ప్రతిభ, ఆర్థిక, వాణిజ్యం సహా అనేక ఇతర అంశాలలో అమెరికా దశాబ్దాలుగా జత కట్టిందన్నారు. చైనా నుంచి వచ్చే వ్యూహాత్మక ముప్పును ఎదుర్కోవవడానికి జతకట్టాల్సిన దేశంతో ఇప్పుడు సంబంధాలను తెంచేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
మరోవైపు, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కూడా అధ్యక్షుడి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) చేతిలో చేయి వేసుకుని చర్చించుకుంటున్న వీడియోను పోస్టు చేసిన ఆయన.. అమెరికా అధ్యక్షుడి వైఖరిని ఎండగట్టారు. భయపడకండి.. ట్రంప్ తన బాడీగార్డులను షికాగోను పంపిస్తున్నారని రాసుకొచ్చారు. షికాగోలో నేరాలు, అక్రమ వలసలు అరికట్టడంలో ట్రంప్ విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియా గవర్నర్ తాజాగా ఈ పోస్టు పెట్టారు.