అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | తెలంగాణ యువతను నక్సలిజం వైపు మళ్లించే కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) సోమవారం హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. నక్సల్స్ సిద్ధాంతాన్ని అంతం చేయలేమన్నారు. ఆ సిద్ధాంతం నచ్చకపోతే వాదించి గెలవాలి కానీ అంతం చేస్తామంటే కుదరరు అని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఆయన మాటలు పోలీసుల త్యాగాలను అవమానపరచడమే అన్నారు.
Bandi Sanjay | పోలీసులకు గౌరవం ఇవ్వరా..
రాష్ట్ర హోంమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ పోలీసులకు గౌరవం ఇవ్వరా అని బండి సంజయ్ ప్రశ్నించారు. మాజీ నక్సలైట్లు రాష్ట్ర కేబినెట్‌లో కూర్చున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి సీతక్క గతంలో మావోయిస్టుగా పని చేసిన విషయం తెలిసిందే. అలాగే నక్సలైట్‌ను పద్మ అవార్డుకు సిఫారసు చేశారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సల్స్ భావజాలం ఉన్నవారే విద్యా కమిషన్‌లో ఉన్నారని మండి పడ్డారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిది కూడా అదే సిద్ధాంతమని పేర్కొన్నారు. తెలంగాణ యువతను తిరిగి నక్సలిజం వైపు మళ్లించే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay | అంతం చేస్తాం
తాము నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 వరకు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ధాటికి ఇప్పటికే వందలాది ఎన్కౌంటర్లు చోటు చేసుకోగా చాలా మంది మావోయిస్టులు హతం అయ్యారు. పలువురు కీలక నేతలు సైతం మృతి చెందారు. మరోవైపు ఆపరేషన్ కగార్తో పలువురు నక్సల్స్ అడవులను వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు.