అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐటీ రంగ (IT sector) అభివృద్ధికి మరో అడుగు పడింది. ప్రఖ్యాత అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం (IBM) భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ (Amaravati Quantum Valley) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా, అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ‘అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్’ (AQCC) నిర్మించనున్నారు. ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఐబీఎం కీలక భాగస్వామిగా ముందుకు రావడం విశేషం.
Amaravati | ఉచితంగా క్వాంటమ్ కంప్యూటర్
ఈ క్వాంటమ్ సెంటర్‌లో 133 బిట్ సామర్థ్యంతో కూడిన అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా, 5K గేట్ సామర్థ్యంతో కూడిన క్వాంటమ్ కంప్యూటర్‌ను (Quantum Computer) ఉచితంగా అందించేందుకు ఐబీఎం ముందుకొచ్చింది. ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి ఐబీఎం ప్రభుత్వ ప్రతిపాదనలకు పూర్తి సహకారం ప్రకటించింది. చదరపు అడుగుకు రూ.30 చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసిన ఐబీఎం, రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలకు నాలుగేళ్ల పాటు ఏటా 365 గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలందించనుంది.
ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా అమరావతిలో (Amaravathi) సమాచార, సాంకేతిక రంగానికి కొత్త ఊపిరి అందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ స్థాయిలో క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ అభివృద్ధితో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉండగా, విద్యార్థులు, పరిశోధకులకు నూతన అవకాశాలు లభించనున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించారు. అమరావతిని ‘ఇంటెలిజెంట్ సిటీల’ శ్రేణిలోకి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం, టెక్నాలజీ విప్లవానికి కేంద్ర బిందువుగా రాజధానిని తీర్చిదిద్దే ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నది.