అక్షరటుడే, వెబ్డెస్క్ : Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ సోమవారం తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. దక్షిణ ఢిల్లీలోని (South Delhi) చత్తర్పూర్లోని ఒక ప్రైవేట్ నివాసానికి మారారు.
మాజీ ఉప రాష్ట్రపతికి కేటాయించే టైప్-8 బంగ్లాకు కాకుండా, ఐఎన్ ఎల్ డీ నేత అభయ్ చౌతాలాకు చెందిన ఫామ్ హౌస్ కు మారడం ప్రాధాన్యం చెందింది. జగదీప్ కోసం కేటాయించిన నివాసంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున కొంత సమయం పడుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రైవేట్ ఫామ్ హౌస్(private farmhouse)కు మారినట్లు చెబుతున్నారు.
Jagdeep Dhankhar | పెన్షన్ కోసం అప్లై..
అధికారిక నివాసాన్ని వీడక ముందు రోజు జగదీప్ ధన్ ఖడ్ (Former Vice President Jagdeep Dhankhar) రాజస్థాన్ శాసనసభ మాజీ సభ్యుడిగా తన పెన్షన్ను తిరిగి పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. 1993 నుండి 1998 వరకు రాజస్థాన్లోని కిషన్గఢ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన జూలై 2019 నుంచి మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ పొందుతున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులైన తర్వాత పెన్షన్ ను నిలిపి వేశారు.
Jagdeep Dhankhar | రాజీనామా కారణాలపై వీడని సస్పెన్స్
మరో మూడేళ్లు పదవీకాలం ఉండగా, జగదీప్ అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. జూలై 21న ఆయన ఆకస్మికంగా రాజీనామా చేయడం దేశ రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో (resignation letter) ఆయన పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీతో పొసగక పోవడం వల్లే ఆయన ఆకస్మికంగా తప్పుకున్నారన్న వార్తలు వచ్చాయి.
రాజీనామా చేసినప్పటి నుంచి ధన్ ఖడ్ బహిరంగంగా కనిపించక పోవడం ఆ వార్తలకు బలం చేకూర్చింది. తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లగా, ఆయన ఆచూకీపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కపిల్ సిబల్, సంజయ్ రౌత్ సహా పలువురు నాయకులు ధంఖర్ గురించి వివరాలు కోరుతూ హోంమంత్రి అమిత్ షాకు (Home Minister Amit Shah) లేఖ రాశారు. ధన్ ఖడ్ ఎక్కడ దాక్కున్నాడు ఎందుకు పూర్తిగా మౌనంగా ఉన్నాడని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించారు.