అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tata Group Rallies | అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ టారిఫ్‌ల(Trump Tariffs)తో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. టాటా గ్రూప్(Tata Group)లోని చాలా కంపెనీలు ఒత్తిడికి గురవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రూప్‌నకు చెందిన ర్యాలీస్(Rallis) కంపెనీ షేరు ధర ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 60 శాతానికిపైగా పెరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) ఏడాది కాలంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు భారీ లాభాలు అందించిన బ్లూచిప్ కంపెనీ కూడా ఇన్వెస్టర్ల ఓపికను పరీక్షిస్తున్నాయి. ఎక్కువ కంపెనీలు నష్టాలనే మిగిల్చాయి. నమ్మకానికి బ్రాండ్‌గా నిలిచే టాటా గ్రూప్‌లోని అత్యధిక కంపెనీలూ నెగెటివ్ రిటర్న్స్(Nagative Returns) ఇచ్చాయి. అయితే దీనికి ర్యాలీస్ కంపెనీ మినహాయింపు. 2025 క్యాలెండర్ ఇయర్‌లో ఓ మోస్తరు రిటర్న్స్ అందించింది. డిసెంబర్ 31న షేరు ధర రూ. 296 ఉండగా.. ప్రస్తుతం రూ. 355 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 2025 లో దాదాపు 20 శాతం లాభాలను ఇచ్చింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం(Financial Year)లో మాత్రం గణనీయమైన లాభాలను అందించింది. ఏప్రిల్‌లో రూ. 221 ఉన్న షేరు ధర సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి రూ. 355కు చేరడం గమనార్హం. అంటే షేరు ధర 60 శాతానికిపైగా పెరిగిందన్న మాట.
కంపెనీ వివరాలు : టాటా గ్రూప్‌నకు చెందిన ర్యాలీస్ ఇండియా కంపెనీని 1948లో స్థాపించారు. ఇది టాటా కెమికల్స్(Tata Chemicals) అనుబంధ సంస్థ. దేశంలోని ప్రధాన వ్యవసాయ ఇన్‌పుట్‌లను అందించే కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. విత్తనాలు, క్రిమి సంహారకాలు, వ్యవసాయ సంబంధిత రసాయనాలను తయారు చేస్తుంది. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందిస్తోంది. ఈ కంపెనీ విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్ సామర్థ్యం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 2,300లకుపైగా పంపిణీదారుల ద్వారా 40 వేలకంటే ఎక్కువ రిటైల్ కౌంటర్లను నిర్వహిస్తోంది.
భారీ ఒడిదుడుకులు : టాటా ర్యాలీస్ కంపెనీ స్టాక్ ప్రైస్ భారీ ఒడిదుడుకుల(Volatility) మధ్య సాగుతుంటుంది. గతేడాది అక్టోబర్ మధ్య కాలంనుంచి పడిపోతూ వచ్చిన స్టాక్.. ఈ ఏడాది మార్చి నుంచి తేరుకుని మళ్లీ భారీ ర్యాలీ తీసింది. 52 వారాల కనిష్ట ధర రూ. 196 కాగా.. 52 వారాల గరిష్ట ధర రూ. 385.90. ఐదు నెలల కాలంలో దాదాపు 80 శాతానికిపైగా పెరిగిన ఈ స్టాక్ 12 నెలల కాలంలో మాత్రం ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదు. 2023 సంవత్సరంలోనూ పడిపోయి లేచింది. ఇన్వెస్టర్లు కంపెనీ పనితీరును పరిశీలిస్తూ కనిష్టాలవద్ద స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయనడానికి ఈ కంపెనీ ఉదాహరణగా నిలుస్తోంది.