అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Project | కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చర్చను ప్రారంభించగా.. అధికార పక్షం బీఆర్ఎస్పై విరుచుకుపడింది.
బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) కాళేశ్వరం నివేదికపై మాట్లాడారు. అధికార పక్షం నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు మాట్లాడారు. బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Yeleti Maheshwar Reddy) మాట్లాడారు. సుమారు తొమ్మిదిన్నర గంటల పాటు సభలో కాళేశ్వరం నివేదికపై చర్చ సాగింది. అర్ధరాత్రి 1:30 గంటల వరకు సభ నిర్వహించడం గమనార్హం. కాళేశ్వరంలో అనేక అక్రమాలు జరిగాయని, విచారణ నిమిత్తం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. అనంతరం సభను నిరవదికంగా వాయిదా వేశారు.
Kaleshwaram Project | కఠిన చర్యలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట నాటి సీఎం కేసీఆర్ రూ.కోట్లు కొల్లగొట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని గుదిబండలా మార్చి కేసీఆర్ శాశ్వతంగా మరణశాసనం రాశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం పేరుతో దోచుకున్నవాళ్లందరికి శిక్షపడాలని ఆయన పేర్కొన్నారు.
Kaleshwaram Project | రీడిజైన్ కేసీఆర్ కుట్రే
ప్రాణహిత –చేవేళ్ల ప్రాజెక్ట్‌లో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి కేంద్రం, మహారాష్ట్ర ఒప్పుకున్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే అప్పటి సీఎం కేసీఆర్(KCR) కావాలనే నిర్మాణ స్థలాన్ని మేడిగడ్డకు మార్చారన్నారు. నిపుణుల కమిటీ అక్కడ వద్దని హెచ్చరించినా వినకుండా.. డిజైన్ మార్చారని ఆరోపించారు. రీడిజైన్ పేరుతో కేసీఆర్ రూ.కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ స్థలం మార్పు కేసీఆర్ కుట్రే అని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కేసీఆర్, హరీశ్ రావును శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
Kaleshwaram Project | ప్రజలకు హామీ ఇచ్చాం
కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు సీఎం తెలిపారు. అందులో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ నివేదికల ఆధారంగా కమిషన్ విచారణ చేపట్టిందన్నారు. ప్రాణహిత–చేవేళ్ల రీడిజైన్ పేరిట కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిందన్నారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో విద్యుత్తు వినియోగం 3వేల మెగావాట్ల నుంచి 8,450 మెగావాట్లకు పెరిగిందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రీడిజైన్ కారణంగా రూ.1.47లక్షల కోట్లకు చేరిందని సీఎం విమర్శించారు.
Kaleshwaram Project | కేటీఆర్ విమర్శలు
కాళేశ్వరం కేసును సీబీఐ(CBI)కి అప్పగించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీబీఐని ప్రతిపక్షాల నిర్మూలన సెల్‌గా అభివర్ణించారని ఆయన గుర్తు చేశారు. “ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా” అంటూ ప్రశ్నించారు. తమపై ఎన్ని కుట్రలు పన్నినా.. రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.