అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amanta Healthcare IPO | మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఐపీవో (IPO) మార్కెట్‌లో సందడి తగ్గింది. ప్రధానంగా మెయిన్‌బోర్డు నుంచి ఈ వారం ఒకే ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అమంతా హెల్త్‌కేర్ (Amanta Healthcare) కంపెనీ సబ్‌స్క్రిప్షన్ సోమవారం ప్రారంభమైంది. ఈ ఐపీవో వివరాలు తెలుసుకుందామా..
అమంతా హెల్త్‌కేర్ లిమిటెడ్‌ను 1994 డిసెంబర్‌లో స్థాపించారు. ఇది విస్తృత శ్రేణి స్టెరిలైజ్డ్ ద్రవ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటి. ప్రధానంగా పేరెంటరల్స్ కలిగి ఉంది. వీటిని అధునాతన అసెప్టిక్ బ్లో ఫిల్ సీల్ (ABFS), ఇంజెక్షన్ స్ట్రెచ్ బ్లో మోల్డింగ్ (ISBM) టెక్నాలజీలను ఉపయోగించి ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేస్తారు.
ఐవీ ద్రవాలు, డైల్యూయెంట్లు, కంటి చుక్కలు, శ్వాసకోశ సంరక్షణ పరిష్కారాలకు సంబంధించిన ద్రవ ఉత్పత్తులు తయారు చేస్తుంది. అమాంతా హెల్త్‌కేర్ తన వైద్య పరికరాల విభాగం కింద నీటిపారుదల పరిష్కారాలు, ప్రథమ చికిత్స వస్తువులు, కంటి కందెనలను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఉత్పత్తి భాగస్వామ్యాలను కలిగి ఉంది. సొంత బ్రాండ్ కింద 45 జెనరిక్ ఉత్పత్తులను (Generic products) తయారు చేస్తుంది. దేశంలో 320 మంది పంపిణీదారులు, స్టాకిస్టుల ద్వారా వీటిని విక్రయిస్తుంది.
ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 126 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ (Fresh issue) ద్వారా నిధులను సమీకరించనుంది. గుజరాత్‌లోని హరియాలా, ఖేడా వద్ద స్టెరిపోర్ట్ యొక్క కొత్త తయారీ లైన్‌ను ఏర్పాటు చేయడానికి సివిల్ నిర్మాణ పనులకు, పరికరాలు, ప్లాంట్ మరియు యంత్రాల కొనుగోలుకు మూలధన వ్యయ అవసరాలకు, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రైస్ బాండ్ : కంపెనీ రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు ధర(Share price)ను గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ. 126గా నిర్ణయించింది. ఒక్కో లాట్‌లో 119 షేర్లుంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం రూ. 14,994తో బిడ్ వేయాల్సి ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి : ఈ కంపెనీ 2024లో రూ. 281.61 కోట్ల ఆదాయాన్ని(Revenue) సంపాదించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 276.09 కోట్లకు తగ్గింది. అయితే ఇదే కాలంలో రూ. 3.63 కోట్లు ఉన్న నికర లాభం(Net profit) రూ. 10.50 కోట్లకు చేరింది. ఆస్తులు రూ. 352 కోట్లనుంచి రూ. 382 కోట్లకు పెరిగాయి.
కోటా, జీఎంపీ : క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఒక్కో షేరు రూ. 28 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే లిస్టింగ్ రోజు 22 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు : కంపెనీ సబ్‌స్క్రిప్షన్(Subscription) సోమవారం ప్రారంభమైంది. బుధవారం వరకు కొనసాగనుంది. గురువారం రాత్రి ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్ తెలియనుంది. కంపెనీ షేర్లు ఈనెల 8వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.