అక్షరటుడే, ఆర్మూర్ : SRSP | ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరి (Godavari) శాంతించింది. దీంతో శ్రీరామ్ సాగర్ (Sriram Sagar) ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో తగ్గింది.
ఎస్సారెస్పీకి మొన్నటి వరకు ఐదు లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం రాగా.. 1.59 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు భారీగా మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేసి జలాశయం నీటిమట్టం తగ్గించారు. ప్రస్తుతం ఎగువ నుంచి వరదలు తగ్గడంతో గోదావరిలోకి నీటి విడుదలను తగ్గించారు.
SRSP | 14 గేట్లు ఎత్తివేత
శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి ఎగువ నుంచి వరద తగ్గడంతో అధికారులు పలు గేట్లను మూసివేశారు. ఆదివారం 38 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయగా.. సోమవారం 14 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1089.3 (75.314 టీఎంసీలు) అడుగులకు చేరింది.
SRSP | కాahf ద్వారా నీటి విడుదల
ప్రాజెక్ట్ నుంచి వరద గేట్లతో పాటు కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 3,500 క్యూసెక్కులు, వరద కాలువ (Flood Canal) ద్వారా 18వేలు, కాకతీయ కాలువకు 3,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 622 క్యూసెక్కులు పోతోంది.
SRSP | అప్రమత్తంగా ఉండాలి
గోదావరిలోకి కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి సూచించారు. ముఖ్యంగా గోదావరికి నీటి విడుదల తగ్గిందని చేపల వేటకు, పశువులు మేపడానికి వెళ్లొద్దన్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరిగితే నీటి విడుదలను పెంచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు నదిలోకి వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.