అక్షరటుడే, కామారెడ్డి: Mlc Vijayashanthi | కామారెడ్డిలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే బీజేపీ ఏం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar), శంకర్ నాయక్ (MLC Shankar Nayak), బల్మూరి వెంకట్‌లతో కలిసి (MLC Balmuri Venkat) ఆదివారం కామారెడ్డి పట్టణంలో పర్యటించారు.
పట్టణంలోని వరద ముంపునకు గురైన జీఆర్ కాలనీ (GR Colony), కౌండిన్య, హౌసింగ్ బోర్డు కాలనీల్లో (Housing Board Colony) పర్యటించారు. జీఆర్ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరదలకు గల కారణాలపై ఆరా తీశారు. వరదతో తీవ్రంగా నష్టపోయామని బాధిత కుటుంబాలు ఎమ్మెల్సీల బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యాయి.
Mlc Vijayashanthi | వరదల్లో సర్వం కోల్పోయాం..
వరదల్లో సర్వం కోల్పోయామని, ప్రాణాలతో బయట పడ్డామని చెప్పుకున్నారు. తమ విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తడిసి ముద్దయ్యాయన్నారు. వరదల సమయంలో డాబాలు, ట్యాంకులపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని విజయశాంతి బాధిత కుటుంబాలను ఓదార్చారు. జీఆర్ కాలనీలో దాదాపు రెండు గంటల పాటు విజయశాంతి పర్యటించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను వరద నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న వసతులు, సహాయంపై ఆరా తీశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
Mlc Vijayashanthi | అత్యధిక ప్యాకేజీ ఇవ్వాలని కోరతాం
2018 ఎన్నికల సమయంలో కామారెడ్డికి ప్రచారం నిమిత్తం వచ్చానని, అప్పుడున్న కామారెడ్డి, ఇప్పుడున్న కామారెడ్డిని (Kamareddy) చూస్తే బాధేస్తుందని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. ఒక్కో ఆడబిడ్డ వారి పరిస్థితి చెబుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు. కాలనీ వాసుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఈ పరిణామం ఎవరూ ఉహించనిదని పేర్కొన్నారు. ప్రజల బాధ కళ్లారా చూశాక వారు అనుకున్న దానికన్నా ఎక్కువే ప్రభుత్వం ఇచ్చేలా చూస్తామన్నారు. ప్రజలు ఇంతలా అల్లాడుతుంటే బీజేపీ ఏం చేస్తోందని విజయశాంతి ప్రశ్నించారు.
Mlc Vijayashanthi | కేంద్రం కూడా స్పందించాల్సింది..
తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను ఇక్కడి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కేంద్రమే ముందుకు వచ్చి నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిందని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీ ప్రతినిధులను ప్రజలు గెలిపించింది జాలీగా కూర్చోవడానికి కాదని ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే తమకు ఇప్పటివరకు కనిపించలేదని కాలనీవాసులు చెబుతున్నారన్నారు.
Mlc Vijayashanthi | సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ముందుకు రావాలి..
బఫర్ జోన్‌పై (Buffer zone) విలేకరులు ప్రశ్నించగా గతంలో చేసిన తప్పుల వల్లే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయన్నారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలకు అతీతంగా వరద ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తలా ఒక చేయి వేయాలని కోరారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలని సూచించారు.
నష్టంపై నివేదిక ఇవ్వడానికే వచ్చాం
కామారెడ్డిలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఇక్కడి పరిస్థితులను పరిశీలించి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసమే తాము వచ్చామని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు అధికారులు చాలా కష్టపడ్డారని కితాబిచ్చారు. తమ పార్టీ నాయకులు ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ప్రజల అభివృద్ధి కోసం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తుందన్నారు.
భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రజల్ని తప్పు పడతారా..
వరదల్లో ఇబ్బందులకు గురైన ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రజలనే తప్పు పడతారా అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. వరదల విషయంలో రాజకీయం చేయొద్దని తాము అనుకున్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలకు తెరలేపాయన్నారు. ప్రజలను తప్పుపట్టేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. తాము ప్రజలకు ధైర్యం చెప్పడానికే వచ్చామని, వారికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
శాసన మండలిలో చర్చిస్తాం..
కామారెడ్డి వరద ఘటనపై ఛైర్మన్ అనుమతి తీసుకుని శాసన మండలిలో ప్రత్యేకంగా చర్చిస్తామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. కామారెడ్డికి ఇలాంటి పరిస్థితుల్లో తాము రావాల్సి వస్తుందని కలలో కూడా ఉహించలేదన్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి లాస్ అసెస్మెంట్ కమిట్ ఏర్పాటు చేసి అత్యధిక పరిహారం అందించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. కామారెడ్డిలో ఇద్దరు లెజెండ్లను కాదని వెంకట రమణారెడ్డిని గెలిపిస్తే కామారెడ్డి ప్రజలనే ఆయన దోషులుగా చూపిస్తూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో ఆయనకు అత్యధిక ఓట్లు రాలేవా అని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi sanjay) కేంద్ర మంత్రులుగా కాకుండా తెలంగాణ మంత్రులుగా మాట్లాడతారని విమర్శించారు. కేంద్రాన్ని రూ.10వేల కోట్లు అడిగితే రూ.10 కోట్లు కూడా ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. గుజరాత్‌లోని సబర్మతి కడితే దానిపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తారని విమర్శించారు. గణపతి బొప్పా మోరియా కావాలయ్యా యూరియా అని మాట్లాడే బీఆర్ఎస్కు కామారెడ్డి వద్దా అని ప్రశ్నించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు గిరిజ షెట్కార్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, నాయకులు పాల్గొన్నారు