అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Krishna Mohan | పార్టీ ఫిరాయించిన కేసులో ఇటీవల స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి (Gadwal MLA Krishnamohan Reddy) ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారి తప్పు చేశానని తెలిపారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గంలో పనులు జరుగుతాయని భావించి పార్టీ మారినట్లు చెప్పారు.
కాంగ్రెస్‌లో (Congress) ఉంటే కిరాయి ఇంట్లో ఉన్నానన్న ఫీలింగ్ వస్తోందని వ్యాఖ్యానించారు. అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారానన్న కృష్ణామోహన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి (constituency development) కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్‌లో ఉంటే కిరాయి ఇంట్లో ఉంటున్నట్లు అనిపిస్తుందన్నారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో (Harish Rao) తాను రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉన్నానని చెప్పారు. స్పీకర్ నోటీసులు వచ్చాయని, సమాధానం కూడా ఇచ్చానని తెలిపారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్‌లోనే (BRS Party) ఉన్నానని, అదే విషయాన్ని స్పీకర్‌కు ఇచ్చిన సమాధానంలో తెలిపానన్నారు.
MLA Krishna Mohan | స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మూడు నెలల్లో ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు (Suprem Court) ఆదేశాల మేరకు స్పీకర్ ఇటీవల పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు సభాపతికి లిఖితపూర్వకంగా సమాధానమిస్తున్నారు.
కొందరేమో తాము సాంకేతికంగా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నామని చెబుతుండగా, కడియం శ్రీహరి (Kadiyam Srihari) లాంటి వారు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారామని, ఈ విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. అదే సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు శాసనసభ రికార్డుల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.