అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Solar Plant | వివిధ వ్యాపారాలు చేపడుతూ దేశంలోనే టాప్ కంపెనీగా ఉన్న రిలయన్స్ ప్రపంచంలోనే పెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఈ మేరకు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి చర్యలు చేపడుతోంది. గ్రీన్ ఎనర్జీ పాలసీ(Green Energy Policy)లో భాగంగా సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రజలు వ్యక్తిగతంగా సోలార్ ప్లాంట్లు, యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సహాకాలు అందిస్తోంది. ఈ క్రమంలో రిలయన్స్ కంపెనీ సింగపూర్ కంటే విస్తిర్ణంలో మూడు రెట్ల పెద్ద సోలార్ ప్లాంట్(Solar Plant) ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌లోని కచ్‌లో 5,50,000 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు అంబానీ ప్రకటించారు.
Solar Plant | ప్రపంచంలోనే పెద్దది
రిలయన్స్(Reliance) ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ ప్రపంచంలో పెద్దదిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రతిరోజూ 55 MW సోలార్ మాడ్యూల్స్, 150 MWh బ్యాటరీ కంటైనర్లను మోహరిస్తుంది. దీని ద్వారా రానున్న పదేళ్లలో భారతదేశ విద్యుత్ అవసరాలలో దాదాపు 10శాతం తీర్చవచ్చని అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ జామ్‌నగర్, కాండ్లాలో రిలయన్స్ సముద్ర, భూ మౌలిక సదుపాయాలతో సజావుగా అనుసంధానం చేస్తామన్నారు.
Solar Plant | సోలార్ ప్యానెళ్ల తయారి
రిలయన్స్ సోలార్ PV తయారీ ప్లాట్‌ఫామ్ పనిచేయడం ప్రారంభించిందని అంబానీ తెలిపారు. దాని మొదటి 200 MW హెటెరోజంక్షన్ టెక్నాలజీ (HJT) మాడ్యూళ్లను ఉత్పత్తి చేస్తుందని ప్రకటించారు. ఇవి 10 శాతం అధిక దిగుబడి, 20 శాతం మెరుగైన ఉష్ణోగ్రత పనితీరు అందిస్తాయన్నారు.